Chicken Fry : చికెన్ ను ఇష్టంగా తినే వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. చికెన్ ను తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్స్ తోపాటు ఇతర పోషకాలు లభిస్తాయి. చికెన్ తో వివిధ రకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో భాగంగా మారినేట్ చేసే అవసరం లేకుండానే చికెన్ తో రుచిగా ఫ్రై ని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – ఒక కిలో, నూనె – 5 లేదా 6 టేబుల్ స్పూన్స్, సాజీరా – ఒక టీ స్పూన్, బిర్యానీ ఆకులు – 2, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2 (పెద్దవి), తరిగిన పచ్చిమిర్చి – 4, కరివేపాకు – ఒక రెబ్బ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, పెరుగు – అర కప్పు, ఎండు కొబ్బరి పొడి – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా.
మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
దాల్చిన చెక్క – 2 ఇంచుల ముక్క, లవంగాలు – 6, యాలకులు – 4, మిరియాలు – ఒక టీ స్పూన్, ఎండు మిరపకాయలు – 10 లేదా 12, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్.
చికెన్ ఫ్రై తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు, ఎండు మిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ధనియాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. తరువాత వీటన్నింటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్ ఫ్రై కు కావాల్సిన మసాలా పొడి తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద కళాయిని ఉంచి అందులో నూనెను వేయాలి. నూనె కాగిన తరువాత సాజీరా, బిర్యానీ ఆకులు వేసి వేయించుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి.
ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. తరువాత పసుపు, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగిన చికెన్ ను వేసి కలుపుకోవాలి. తరువాత పెరుగును వేసి అంతా కలిసేలా మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు కళాయి మీద మూతను ఉంచి మధ్యమధ్యలో కలుపుతూ 20 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించుకోవాలి. తరువాత ముందుగా తయారు చేసుకున్న మసాలా పొడిని వేసి కలపాలి.
ఇలా కలిపిన తరువాత మరలా కళాయి మీద మూతను ఉంచి మరో 10 నిమిషాల పాటు చికెన్ ను వేయించుకోవాలి. చివరగా కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రై తయారవుతుంది. చికెన్ ను మారినేట్ చేసే సమయం లేని వారు ఇలా చేయడం వల్ల కూడా చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. దీనిని నేరుగా లేదా పప్పు, సాంబార్ వంటి వాటితో కూడా కలిపి తినవచ్చు.