Spices : నిత్యం మన వంటింట్లో ఉండే దినుసులు, పదార్థాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మన వంటింట్లో ఎన్నో రకాల దినుసులు, పదార్థాలు ఉంటాయి. వీటిని వంటల్లో ఉపయోగించడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. వీటిలోని ఔషధ గుణాలు తెలుసుకున్న మన పెద్దలు వీటిని మన వంటల్లో భాగం చేశారనే చెప్పవచ్చు. ఈ మసాలా దినుసులను కానీ పదార్థాలను కానీ చక్కగా ఉపయోగిస్తే అసలు మనం వైద్యుని వద్దకు వెళ్లే అవసరమే ఉండదు. ఇలా మన వంట గదిలో ఉండే కొన్ని దినుసుల గురించి వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మన వంట గదిలో ఉండే వాటిల్లో పసుపు కూడా ఒకటి. పసుపుకు మన శరీరంలో వచ్చే వాత, పిత్త, కఫ దోషాలను నయం చేసే గుణం ఉంది. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో కూడా పసుపు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. శనగపిండిలో పసుపును కలిపి ఫేస్ ఫ్యాక్ గా వాడడం వల్ల ముఖారవిందం మరింత పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలు తలెత్తినప్పుడు పసుపును పాలల్లో కలుపుకుని తాగడం వల్ల ఆయా సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. పసుపును వాడడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధుల బారిన పడకుండా ఉంటాం.
అలాగే మన వంటింట్లో ఉండే వాటిల్లో అల్లం కూడా ఒకటి. అల్లంలో ఉండే ఔషధ గుణాలు అన్నీ ఇన్నీ కావు. జీర్ణసంబంధిత సమస్యలయినటువంటి అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలను నయం చేయడంలో అల్లం మనకు ఎంతగానో దోహదపడుతుంది. అల్లం రసాన్ని తాగడం వల్ల అజీర్తి, గ్యాస్ వంటి సమస్యల నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది. ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్నప్పుడు అల్లం రసంలో తేనె కలుపుకుని తాగడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. ఈ విధంగా తేనెతో కలిపి అల్లం రసాన్ని తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటి శ్వాస సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి.
మెంతులను కూడా మనం వంటల్లో అప్పుడప్పుడూ ఉపయోగిస్తూ ఉంటాం. షుగర్ వ్యాధి గ్రస్తులకు మెంతులు దివ్యౌషధంగా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ మెంతులను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. నిత్యం పరగడుపున మెంతుల చూర్ణం లేదా మెంతుల నీటిని తాగడం వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గడంతో పాటు షుగర్ వ్యాధి కూడా నియంత్రణలో ఉంటుంది. ఈ విధంగా మెంతులను తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి త్వరగా బరువు తగ్గుతారు.
మన వంటగదిలో పోపుల పెట్టలో ఉండే దినుసుల్లో జీలకర్ర కూడా ఒకటి. జీలకర్రను మనం ప్రతిరోజూ వంటల తయారీలో ఉపయోగిస్తూ ఉంటాం. జీర్ణశక్తిని పెంచడంలో జీలకర్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. జీలకర్రను విరివిరిగా ఉపయోగించడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.
అలాగే మనం వంటల్లో పచ్చి ఉసిరిని లేదా ఎండబెట్టిన ఉసిరి కాయలను ఉపయోగిస్తూ ఉంటాం. ఉసిరి కాయలను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కంటి చూపును మెరుగు పరచడంలో, జుట్టును నల్లగా ఉంచడంలో ఉసిరి కాయ ఎంతగానో తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. వీలైతే ప్రతిరోజూ ఒక ఉసిరికాయను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.