Chicken Lollipop : నాన్ వెజ్ స్నాక్స్ అనగానే ముందుగా మనకు చికెన్ తో చేసే వంటకాలే గుర్తుకు వస్తాయి. వీటిలో చికెన్ 65, చికెన్ డ్రమ్ స్టిక్స్, చికెన్ లాలీపాప్స్ మొదలైనవి ముందు వరుసలో ఉంటాయి. ఇవి మనం బయట హోటల్ లో తిన్నప్పుడు క్రిస్పీగా కరకరలాడుతూ ఎంతో రుచికరంగా ఉంటాయి. ఇంట్లో కూడా అదే రుచి వచ్చే విధంగా మనం వీటిని తయారు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు చికెన్ లాలీపాప్ లను ఎలా తయారు చేసుకోవాలో తెలుపుకుందాం.
చికెన్ లాలీపాప్ లను తయారు చేయడానికి కావలసిన పదార్థాలు..
చికెన్ వింగ్స్ – 500 గ్రాములు (10 నుండి 12 ముక్కలు), అల్లం వెల్లుల్లి పేస్ట్- 1 టేబుల్ స్పూన్, కారం – 1 టీ స్పూన్, చికెన్ 65 మసాలా – 1 టీ స్పూన్, వెనిగర్ – 1 టీ స్పూన్, సోయా సాస్ – అర టీ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ – 1 టీ స్పూన్, మైదా – 2 టేబుల్ స్పూన్లు, ఎగ్ వైట్ – 1, ఉప్పు- తగినంత, వంట నూనె – తగినంత, రెడ్ ఫుడ్ కలర్- చిటికెడు.
చికెన్ లాలీపాప్‌లను తయారు చేసే విధానం..
ముందుగా చికెన్ వింగ్స్ ను కడిగి 5 నుండి 10 నిమిషాల పాటు నీళ్లు పూర్తిగా పోయేంత వరకు వంపుకోవాలి. ఆ తరువాత చికెన్ ముక్కలకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, చికెన్ 65 మసాలా, వెనిగర్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, ఉప్పు మొదలైనవన్నీ కలిపి 2 గంటల పాటు మారినేట్ చేసుకోవాలి. ఆ తరువాత చికెన్ లాలీలిపాప్స్ ను వేయించుకునే ముందు వాటిలో ఎగ్ వైట్, మైదా ఇంకా ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు వేయించడానికి సరిపడా వంట నూనెను కళాయిలో తీసుకొని వేడి చేసుకోవాలి. నూనె మరిగాక అందులో చికెన్ లాలీపాప్ ముక్కలను వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించిన ముక్కలను బయటకు తీసి టిష్యూ పేపర్ పై ఉంచుకోవాలి. ఇలా చేయడం వలన టిష్యూ పేపర్ ఎక్కువగా ఉన్న నూనెను పీల్చుకుంటుంది. దీంతో కరకరలాడే చికెన్ లాలీపాప్స్ రెడీ అవుతాయి. వీటిని టమాటా కెచప్ లేదా మయోనీజ్ తో కలిపి తింటే మరింత రుచిగా ఉంటాయి.