Chicken Malai Kebab : మనకు రెస్టారెంట్ లలో లభించే చికెన్ వెరైటీలల్లో చికెన్ మలై కబాబ్స్ కూడా ఒకటి. ఈ కబాబ్స్ జ్యూసీగా, చాలా రుచిగా ఉంటాయి. వీటిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. స్టాటర్ గా, స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ చికెన్ మలై కబాబ్స్ ను అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. తందూర్, ఒవెన్ లేకపోయినా సరే వీటిని ఇంట్లో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా చికెన్ మలై కబాబ్స్ ను ఇంట్లోనే తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో కమ్మగా, జ్యూసీగా ఉండే ఈ చికెన్ మలై కబాబ్స్ ను ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ మలై కబాబ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బోన్ లెస్ చికెన్ – 300 గ్రా.,నిమ్మరసం – అర చెక్క, ఉప్పు – తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, ఫ్రెష్ క్రీమ్ – 4 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ – 2 టీస్పూన్స్, మిరియాల పొడి – అర టీ స్పూన్, బటర్ – ఒక టేబుల్ స్పూన్.
చికెన్ మలై కబాబ్ తయారీ విధానం..
ముందుగా చికెన్ ను గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత ఈ చికెన్ లో బటర్ తప్ప మిగిలిన పదార్థాలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ చికెన్ పై మూత పెట్టి 2 గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచి మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ ను చక్కగా మ్యారినేట్ చేసిన తరువాత ఈ చికెన్ ను స్టిక్స్ కు గుచ్చి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు కళాయిలో బటర్ వేసి వేడి చేయాలి. తరువాత చికెన్ స్టిక్స్ ను ఉంచి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై వేయించాలి. ఈ చికెన్ ను అటూ ఇటూ తిప్పుతూ వేయించాలి. చికెన్ మెత్తగా ఉడికిన తరువాత ప్లేట్ లోకి తీసుకోవాలి. మిగిలిన చికెన్ ను వేయించే ముందు కళాయిని శుభ్రం చేసి మరలా బటర్ వేసి వేయించాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ మలై తయారవుతుంది. దీనిని గ్రీన్ చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఇంట్లోనే చికెన్ మలై కబాబ్ ను తయారు చేసుకోవచ్చు. ఒక్క ముక్క కూడా విడిచి పెట్టకుండా వీటిని ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.