Chicken Pachadi : మనలో చాలా మంది చికెన్ ను ఇష్టంగా తింటూ ఉంటారు. చికెన్ ను తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికీ తెలుసు. చికెన్ తో మనం వివిధ రకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. చికెన్ తో చేసే వంటకాలలో చికెన్ పచ్చడి కూడా ఒకటి. చికెన్ పచ్చడి ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఈ పచ్చడిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. చికెన్ పచ్చడి మనకు బయట కూడా దొరుకుతుంది. దీనిని మనం చాలా సులువుగా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. చికెన్ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
బోన్ లెస్ చికెన్ – అర కిలో, పసుపు – పావు టీ స్పూన్, నూనె – 150 ఎంఎల్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, యాలకులు – 2, లవంగాలు – 5, ధనియాలు – 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టేబుల్ స్పూన్, మెంతులు – పావు టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – పావు కప్పు, కారం – పావు కప్పు, నిమ్మకాయలు – 2 (మధ్యస్థంగా ఉన్నవి).
చికెన్ పచ్చడి తయారీ విధానం..
ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసిన బోన్ లెస్ చికెన్ ను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పును, పసుపును వేసి కలిపి మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత ఒక కళాయిలో లవంగాలను, దాల్చిన చెక్కను, యాలకులను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ధనియాలను, ఆవాలను, జీలకర్రను, మెంతులను వేసి దోరగా వేయించాలి. ఇవి అన్నీ చల్లగా అయిన తరువాత ఒక జార్ లోకి తీసుకుని మెత్తని పొడి అయ్యేలా మిక్సీ పట్టుకోవాలి.
ఇప్పుడు ఒక కళాయిలో నూనె పోసి నూనె కాగిన తరువాత ముందుగా ఉప్పు, పసుపు వేసి కలిపి పెట్టుకున్న చికెన్ ను వేసి మధ్యస్థ మంటపై కలుపుతూ వేయించుకోవాలి. ఈ చికెన్ ను పూర్తిగా ఉడికి పై భాగం కరకరలాడుతూ ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించిన తరువాత చికెన్ ను ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించిన తరువాత ముందుగా ప్లేట్ లోకి తీసుకున్న చికెన్ ను మళ్లీ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడి నుండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ మసాలా పొడిని, ఉప్పును, కారాన్ని కూడా వేసి అంతా కలిసేలా బాగా కలపాలి.
ఇలా కలిపిన తరువాత చికెన్ నుండి నురుగు బయటకు వస్తుంది. నురుగు రాగానే స్టవ్ ఆఫ్ చేయాలి. తరువాత నిమ్మకాయలను కోసి పచ్చడిలో రసాన్ని పిండి బాగా కలపాలి. ఈ పచ్చడి చల్లగా అయిన తరువాత గాజు సీసాలో నిల్వ చేసుకోవడం వల్ల మూడు నెలల పాటు తాజాగా ఉంటుంది. బయట ఎక్కువ ధరకు ఈ చికెన్ పచ్చడిని కొనుగోలు చేయడానికి బదులుగా ఇలా ఇంట్లోనే మనం రుచిగా దీన్ని తయారు చేసుకుని తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.