Rasam Powder : మనం వంటింట్లో చారు, సాంబార్ వంటి వాటితోపాటు రసాన్ని కూడా తయారు చేస్తూ ఉంటాం. అన్నంలో వేడి వేడి రసాన్ని వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. రసం తయారీలో మనం ప్రత్యేకంగా చేసిన రసం పొడిని ఉపయోగిస్తాం. రసం పొడి మనకు బయట కూడా దొరుకుతుంది. బయట దొరికే రసం పొడితో చేసిన రసం అంత రుచిగా ఉండదు. ఈ రసం పొడిని మనం ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసుకుని చాలాకాలం వరకు నిల్వ చేసుకోవచ్చు. ఈ రసం పొడిని ఏవిధంగా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రసం పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపప్పు – పావు కప్పు, కంది పప్పు – పావు కప్పు, ధనియాలు – పావు కప్పు, ఎండు మిర్చి ముక్కలు- అర కప్పు లేదా తగినన్ని, జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్, మిరియాలు – ఒక టేబుల్ స్పూన్, మెంతులు – అర టీ స్పూన్, దాల్చిన చెక్క ముక్కలు – ఒక టీ స్పూన్, కరివేపాకు – గుప్పెడు, పసుపు – ఒక టీ స్పూన్.
రసం పొడి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో శనగ పప్పును, కంది పప్పును వేసి చిన్న మంటపై 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. తరువాత ధనియాలను, ఎండు మిర్చి ముక్కలను వేసి కలుపుతూ 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తరువాత జీలకర్రను, మిరియాలను వేసి మాడిపోకుండా కలుపుతూ 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తరువాత మెంతులను, దాల్చిన చెక్క ముక్కలను వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. చివరగా కరివేపాకును వేసి కలుపుతూ కరివేపాకు కరకరలాడే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇలా వేయించిన దినుసులన్నీ చల్లగా అయిన తరువాత ఒక జార్ లోకి తీసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ పసుపును వేసి వీలైనంత మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రసం పొడి తయారవుతుంది. ఈ పొడి చల్లారిన తరువాత మూత ఉండే గాజు సీసాలో నిల్వ చేసుకోవడం వల్ల ఆరు నెలల పాటు తాజాగా ఉంటుంది. ఈ విధంగా రసం పొడిని తయారు చేసుకుని నిల్వ చేసుకోవడం వల్ల ఎప్పుడు పడితే అప్పుడు వేడి వేడి రుచిగా రసాన్ని తయారు చేసుకుని తినవచ్చు. ఈ రసం పొడి తయారీలో మనం అన్నీ ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలను ఉపయోగిస్తాం. కనుక ఈ రసం పొడితో రసాన్ని చేసుకుని అన్నంతో కలిపి తినడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి ఇన్ ఫెక్షన్ లు తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి ఇలా రసం పొడిని తయారు చేసుకుని తరచూ రసం చేసుకుని తింటుండాలి.