చల్ల చల్లని వాతావరణంలో ఎవరికైనా వేడివేడిగా కారం కారంగా తినాలనిపిస్తుంది. ఈ విధంగా చల్లని వాతావరణంలో వేడి వేడిగా నోరూరించే చిక్కుడు గారెలు తయారు చేసుకుని తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరింకెందుకాలస్యం చిక్కుడు గారెలు ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
ఒక కప్పు చిక్కుడు గింజలు, అల్లం చిన్న ముక్క, పచ్చి మిరపకాయలు 10, ఉల్లిపాయ ముక్కలు అర కప్పు, పుదీనా కొద్దిగా, పచ్చి కరివేపాకు, కొత్తిమీర గుప్పెడు, ఉప్పు తగినంత, బేకింగ్ సోడా చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత, బియ్యంపిండి మూడు టేబుల్ స్పూన్లు.
తయారీ విధానం
పచ్చి చిక్కుడుగింజల, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ మిశ్రమంలోకి పుదీనా, కరివేపాకు, కొత్తిమిర, బియ్యపు పిండి వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమంలోకి చిటికెడు బేకింగ్ సోడా వేసి మిశ్రమం మొత్తం బాగా కలిసేలా తయారు చేసుకోవాలి. స్టవ్ మీద కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయిన తర్వాత కొద్ది కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకొని గారెలుగా వేసుకోవాలి. అటు ఇటు తిప్పుతూ ఎర్రగా అయ్యే వరకు కాల్చి తీసేయాలి. ఈ విధంగా వేడి వేడిగా ఉండే చిక్కుడు గారెలను టమోటో చట్నీ, లేదా టమోటో కెచప్ తో తింటే అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి.