information

గూగుల్‌ పే ద్వారా మనం ఉచితంగానే సేవలు పొందుతాం కదా ? మరి గూగుల్‌కు ఆదాయం ఎలా వస్తుంది ? తెలుసా ?

ప్రముఖ టెక్‌ దిగ్గజ సంస్థ గూగుల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్మార్ట్ ఫోన్లలో, కంప్యూటర్లలో ఎన్నో యాప్స్‌, సైట్ల ద్వారా సేవలు అందిస్తోంది. వాటిల్లో గూగుల్‌ పే ఒకటి. దీని ద్వారా ఉచితంగానే యూపీఐ మాధ్యమంలో డబ్బులు పంపుకోవచ్చు. బిల్లులను చెల్లించవచ్చు. అయితే మనం అందులో ఉచితంగానే డబ్బులను పంపించుకుంటాం కదా. మరి గూగుల్‌ పేకు రెవెన్యూ ఎలా వస్తుంది ? వారు ఆదాయం ఎలా పొందుతారు ? అనే ప్రశ్నలు మీకు ఉద్భవించవచ్చు. కానీ గూగుల్‌ పే ద్వారా కూడా గూగుల్‌కు ఆదాయం వస్తుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్‌ పేలో మనం ఇంకొకరికి డబ్బులను పంపించుకోవడమే కాదు.. మొబైల్‌ రీచార్జిలు చేసుకోవచ్చు. పోస్ట్‌పెయిడ్‌ బిల్లులు, గ్యాస్, విద్యుత్‌ బిల్లులు, ఇతర బిల్లులను చెల్లించవచ్చు. అయితే ఆ బిల్లులను చెల్లించినప్పుడు బిల్లు మొత్తాన్ని బట్టి కొంత మొత్తంలో కమిషన్‌ సంబంధిత సంస్థ నుంచి గూగుల్‌ పేకు చేరుతుంది. ఇలా గూగుల్‌ పే కు ఆదాయం వస్తుంది.

how google earns money with google pay

సహజంగానే గూగుల్‌ పే లో బిల్లు చెల్లింపులు ఎక్కువగా చేస్తుంటాం కాబట్టి గూగుల్‌ పేకు ఆదాయం కూడా బాగానే వస్తుంది. అలాగే యూపీఐ ద్వారా మనం ఇతరులకు డబ్బులు పంపుతాం కదా.. అలాంటి యూజర్ల ట్రాన్సాక్షన్లకు చెందిన డేటా అంతా గూగుల్‌ పే దగ్గర ఉంటుంది. దాన్ని గూగుల్‌ తన సొంత పనులకు వినియోగించుకుంటుంది. యూజర్లు ఖర్చు చేసే మొత్తాలను బట్టి వారి డేటాతో వారికి ఇంకా ఎలాంటి సేవలు అందించవచ్చు ? దాని ద్వారా ఎలా ఆదాయం రాబట్టవచ్చు ? అని ప్రయత్నిస్తుంది. ఇలా గూగుల్‌ కు గూగుల్‌ పే యాప్‌ ద్వారా కూడా ఆదాయం, లాభం రెండూ లభిస్తాయి.

కాగా 2020 సంవత్సరంలో గూగుల్‌ పేకు రూ.1501 కోట్ల ఆదాయం రాగా రూ.32.87 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అందువల్ల మనకు చూసేందుకు గూగుల్‌ పే ఉచితంగా సర్వీస్‌ అందిస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ దాని ద్వారా కూడా గూగుల్‌కు ఆదాయం వస్తుంది.

Admin

Recent Posts