Chikkudukaya Kobbari Karam : మనకు అందుబాటులో ఉండే అత్యంత చవకైన కూరగాయల్లో చిక్కుడు కాయలు కూడా ఒకటి. ఇవి మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. చిక్కుడు కాయలను తరచూ తినడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు. వీటిల్లో ఉండే ఫైబర్ మనకు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. అయితే చిక్కుడు కాయలను చాలా మంది ఇష్టంగానే తింటుంటారు. వీటితో వేపుడు, టమాటా కూర చేస్తారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే చిక్కుడు కాయలతో కొబ్బరికారం వేపుడు కూడా చేయవచ్చు. ఇది కూడా ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని చేయడం కూడా సులభమే. ఈ క్రమంలోనే చిక్కుడు కాయ కొబ్బరి కారం వేపుడును ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చిక్కుడు కాయ కొబ్బరి కారం వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
చిక్కుడు కాయలు – అర కిలో, ఉల్లి తరుగు – అర కప్పు, పచ్చి మిర్చి – 3 (సన్నగా పొడవుగా తరగాలి), పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు, వెల్లుల్లి రెబ్బలు – 4, ఆవాలు – 1 టీస్పూన్, జీలకర్ర – 1 టీస్పూన్, పచ్చి శనగపప్పు – 1 టీస్పూన్, ఉప్పు – తగినంత, గరం మసాలా – అర టీస్పూన్, పసుపు – కొద్దిగా, నూనె – 1 టేబుల్ స్పూన్, కరివేపాకు – 2 రెబ్బలు, ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి).
చిక్కుడు కాయ కొబ్బరి కారం వేపుడును తయారు చేసే విధానం..
ఒక గిన్నెలో చిక్కుడు కాయ ముక్కలకు తగినన్ని నీళ్లు జత చేసి స్టవ్ మీద ఉంచి ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి. స్టవ్ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఎండు మిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగ పప్పు వేసి వేయించాలి. ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు జత చేసి ఉల్లి తరుగు బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి. కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి మరోమారు వేయించాలి. చిక్కుడు కాయ ముక్కలు, ఉప్పు, పసుపు జత చేసి బాగా కలియబెట్టాలి. గరం మసాలా, కొబ్బరి తురుము జత చేసి మరోమారు కలిపి రెండు నిమిషాల పాటు ఉడికించి దింపేయాలి. దీంతో ఎంతో రుచికరమైన చిక్కుడు కాయ కొబ్బరి కారం వేపుడు రెడీ అవుతుంది. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని అన్నంలో కలిపి తింటే భలే రుచి వస్తుంది. అందరూ ఇష్టంగా తింటారు.