Chilli Paneer : పాల నుండి తయారు చేసే పదార్థాల్లో పనీర్ కూడా ఒకటి. పనీర్ ను చాలా మంది ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటారు. పనీర్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం వివిధ రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. పనీర్ ను ఉపయోగించి మనం ఎన్నో రకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. దీంతో చేసుకోదగిన వంటకాల్లో చిల్లీ పనీర్ కూడా ఒకటి. ఈ వంటకం మనకు ఎక్కువగా రెస్టారెంట్లలో లభిస్తుంది. బయట లభించే విధంగా ఈ చిల్లీ పనీర్ ను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చిల్లీ పనీర్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చిల్లీ పనీర్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పన్నీర్ – 200 గ్రా., ఉప్పు – అర టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా, చిన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు – 4, చిన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ – కొద్దిగా, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, పెటల్స్ లా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, పెద్ద ముక్కలుగా తరిగిన క్యాప్సికం – పావు కప్పు, పంచదార – పావు కప్పు, వెనిగర్ – ఒక టీ స్పూన్, సోయా సాస్ – ఒక టీ స్పూన్, చిల్లీ సాస్ – ఒక టీ స్పూన్, టమాట కెచప్ – ఒక టేబుల్ స్పూన్.
చిల్లీ పన్నీర్ తయారీ విధానం..
ముందుగా పనీర్ ను చతురస్రాకారంలో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన పనీర్ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అందులో ఉప్పు, కారం, మిరియాల పొడి, కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకోవాలి. తరువాత ఒకటి లేదా రెండు 2 టీ స్పూన్ల నీళ్లను వేసి అన్నీ కలిసేలా కలుపుకోవాలి. తరువాత అడుగు భాగం మందంగా ఉండే కళాయిలో నూనె పోసి నూనెను వేడి చేయాలి. నూనె వేడయ్యాక పనీర్ ముక్కలను వేసి మధ్యస్థ మంటపై కరకరలాడే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పనీర్ ముక్కలను టిష్యూ పేపర్ ఉంచిన గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక కళాయిలో అర టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలను, స్ర్పింగ్ ఆనియన్స్ ను వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత పచ్చి మిర్చి ముక్కలను వేసి వేయించుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలను, క్యాప్సికం ముక్కలను వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాను ఒక దాని తరువాత ఒకటి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ ను తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నీళ్లను పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న కార్న్ ఫ్లోర్ నీటిని కూడా కళాయిలో వేసి అర నిమిషం పాటు ఉడికించాలి. తరువాత వేయించుకున్న పన్నీర్ ముక్కలను వేసి పెద్ద మంటపై 2 నిమిషాల పాటు కలుపుతూ వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చిల్లీ పనీర్ తయారవుతుంది. ఈ విధంగా చాలా సులభంగా రెస్టారెంట్లలో లభించే విధంగా ఉండే చిల్లీ పనీర్ ను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. తరచూ పనీర్ తో చేసే వంటకాలకు బదులుగా ఇలా కూడా అప్పుడప్పుడూ చేసుకుని తినవచ్చు. ఈ చిల్లీ పనీర్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.