Chiranjeevi : ఏపీలో గత కొద్ది నెలలుగా నెలకొన్న సినీ రంగ సమస్యలకు ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడినట్లు అయింది. ఎన్నో గొడవలు, వాదోపవాదాలు, విమర్శల నడుమ.. ఎట్టకేలకు సోమవారం సాయంత్రం ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలపై కొత్త జీవోను విడుదల చేసింది. ఈ క్రమంలోనే పలు విభాగాల వారీగా కొత్త ధరలను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కొత్త ధరలు థియేటర్లలో అమలు కానున్నాయి. ఇక ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు జీవోను విడుదల చేయడంతో.. ఇకపై విడుదలయ్యే సినిమాలకు చెందిన నిర్మాతలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కలెక్షన్లకు ఇక ఢోకా ఉండదని భావిస్తున్నారు. అయితే చాలా పెద్ద సమస్యను కూడా ఎంతో చాకచక్యంగా సునాయాసంగా పరిష్కరించడం వెనుక మెగాస్టార్ చిరంజీవి కృషి ఎంతో ఉందని చెప్పవచ్చు.
మెగాస్టార్ చిరంజీవి అప్పట్లోనే చెప్పారు.. మా ఎన్నికల సమయంలో తాను ఇండస్ట్రీ పెద్దగా ఉండనని.. కానీ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన చెప్పినట్లే ముందుండి సినీ రంగ సమస్యల పరిష్కారానికి తీవ్రంగా కృషి చేశారు. ఎన్నో సార్లు సీఎం వైఎస్ జగన్‌ను కలిసి సమస్యలను వివరించారు. ఇదే సమయంలో చాలా మంది ఆయనపై అనేక రకాల విమర్శలు చేశారు. అయినప్పటికీ ఆయన అవేమీ పట్టించుకోలేదు. ఆయన తాను చేసే పని చేసుకుపోయారు.
ఇక చివరిగా ఒకసారి ప్రభాస్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతోపాటు రాజమౌళి వంటి దర్శకులతో కలిసి సీఎం జగన్‌తో సమావేశమై.. అత్యంత అణకువగా.. వినమ్రపూర్వకంగా ఆయన సమస్యలను జగన్‌కు సావధానంగా వివరించారు. దీంతో చిరంజీవి కృషి ఫలించింది. జగన్ స్పందించారు. కొత్త జీవోపై సంతకం చేశారు. ఎట్టకేలకు సమస్యలకు చెక్ పడింది. అయితే ఈ విషయంలో కొంత ఆలస్యం జరిగింది. కానీ ఎట్టకేలకు చిరంజీవి మాత్రం సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలో మొదటి నుంచి చివరి వరకు ఎంతో కృషి చేసిన చిరంజీవికే ఈ క్రెడిట్ అంతా దక్కుతుందని పలువురు అంటున్నారు. చిరంజీవి చాలా గ్రేట్ అని.. ఎలాంటి పదవి ఆయనకు లేకపోయినా.. అందరి తరఫున ఆయన సమస్యలపై పోరాటం చేశారని ఆయనకు కితాబిస్తున్నారు.