Chutney Powder : ఒక్క‌సారి ఇలా చ‌ట్నీ పొడి చేసి పెట్టుకుంటే.. మాటి మాటికీ చ‌ట్నీ చేయాల్సిన ప‌ని ఉండ‌దు..!

Chutney Powder : మ‌నం ఇడ్లీ, దోశ వంటి అల్పాహారాల్లోకి ర‌క‌ర‌కాల చ‌ట్నీల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. చ‌ట్నీల‌తో తింటేనే ఈ అల్పాహారాల‌ను మ‌నం తిన‌గ‌ల‌ము. అయితే చ‌ట్నీని త‌యారు చేయ‌డానికి క‌నీసం 20 నిమిషాల స‌మ‌యమైనా ప‌డుతుంది. అయితే అంద‌రికి ఉద‌యం పూట చ‌ట్నీ త‌యారు చేయ‌డానికి త‌గినంత స‌మ‌యం ఉండ‌దు. అలాంటి వారు చ‌ట్నీ పౌడ‌ర్ ను త‌యారు చేసుకుని పెట్టుకోవ‌డం వ‌ల్ల 2 నిమిషాల్లోనే రుచిక‌ర‌మైన చ‌ట్నీని త‌యారు చేసుకోవ‌చ్చు. అయితే మ‌న‌కు బ‌య‌ట మార్కెట్ లో ఇన్ స్టాంట్ చ‌ట్నీ మిక్స్ లు ల‌భిస్తాయి. అయితే వీటిలో నిల్వ ఉండ‌డానికి ఫ్రిజ‌ర్వేటివ్స్ ను క‌లుపుతూ ఉంటారు.

క‌నుక వీటిని తీసుకోవ‌డం అంత మంచిది కాదు. బ‌య‌టవి కొన‌డానికి బ‌దులుగా మ‌న ఇంట్లోనే స‌లుభంగా చ‌ట్నీ పౌడ‌ర్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఇంట్లోనే సుల‌భంగా చ‌ట్నీ పౌడ‌ర్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అలాగే ఈ పౌడ‌ర్ తో చ‌ట్నీని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Chutney Powder recipe in telugu make like this
Chutney Powder

చ‌ట్నీ పౌడ‌ర్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌ల్లీలు – ఒక క‌ప్పు, ఎండు కొబ్బ‌రి ముక్క‌లు – అర క‌ప్పు, పుట్నాల ప‌ప్పు -ఒక క‌ప్పు, ఎండుమిర్చి – 12, జీల‌క‌ర్ర -ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బ‌లు – 10 నుండి 15, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, ఉప్పు – త‌గినంత‌.

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టీ స్పూన్స్, జీల‌క‌ర్ర -ఒక టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 3, క‌రివేపాకు -ఒక రెమ్మ‌.

చ‌ట్నీ పౌడ‌ర్ త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో ప‌ల్లీలు వేసి వేయించాలి. ప‌ల్లీలు కొద్దిగా వేగిన త‌రువాత ఎండు కొబ్బ‌రి ముక్క‌లు, పుట్నాల ప‌ప్పు వేసి వేయించాలి. త‌రువాత ఎండుమిర్చి, జీల‌క‌ర్ర‌, వెల్లుల్లి రెబ్బ‌లు, క‌రివేపాకు వేసి వేయించాలి. వీటిని క‌లుపుతూ మాడిపోకుండా చ‌క్క‌గా వేయించాలి. క‌రివేపాకును క‌ర‌క‌ర‌లాడే వ‌ర‌కు వేయించుకున్న త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి వీటిని చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్త‌ని పొడిలాగా చేసుకోవాలి. త‌రువాత ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని ఇందులో ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత తాళింపుకు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు ప‌దార్థాలు ఒక్కొక్క‌టిగా వేసి వేయించాలి.

తాళింపు చ‌క్క‌గా వేగిన త‌రువాత దీనిని ముందుగా త‌యారు చేసుకున్న పొడిలో వేసి క‌ల‌పాలి.ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే చ‌ట్నీ పౌడ‌ర్ త‌యార‌వుతుంది. దీనిని గాలి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవ‌డం వల్ల నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది. మ‌న‌కు చ‌ట్నీ కావాల్సిన‌ప్పుడు ఈ పొడిని త‌గిన మోతాదులో తీసుకోవాలి. త‌రువాత ఇందులో గోరు వెచ్చ‌ని నీళ్లు పోసి క‌లిపి స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇన్ స్టాంట్ గా రుచిక‌ర‌మైన చ‌ట్నీని త‌యారు చేసుకోవ‌చ్చు. ఇడ్లీ, దోశ‌, వ‌డ ఇలా దేనితో తిన్నా కూడా ఈ చట్నీ చాలా చ‌క్క‌గా ఉంటుంది.

Share
D

Recent Posts