Coconut Burfi : మనం పచ్చికొబ్బరిని కూడా ఆహారంగా తీసుకుంటాము. పచ్చి కొబ్బరి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు అందాన్ని కడా సొంతం చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరిని ఎక్కువగా తీపి వంటకాల్లో వాడుతూ ఉంటాం. పచ్చికొబ్బరితో సులభంగా, రుచిగా తయారు చేసుకోగలిగే తీపి వంటకాల్లో కొకోనట్ బర్పీ ఒకటి. ఈ బర్ఫీ చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా దీనిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే కొకోనట్ బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొకోనట్ బర్ఫీ తయారీకి కావల్సిన పదార్థాలు..
కొబ్బరికాయ – 1, పంచదార – 100 గ్రా., పాలు – 100 ఎమ్ ఎల్, యాలకుల పొడి – అర టీ స్పూన్, నెయ్యి – ఒక టీ స్పూన్.
కొకోనట్ బర్ఫీ తయారీ విధానం..
ముందుగా కొబ్బరికాయ నుండి కొబ్బరిని తీసుకోవాలి. తరువాత ఈ కొబ్బరికి ఉండే నల్లటి భాగాన్ని తీసి వేసి ముక్కలుగా చేసుకోవాలి. తరువాత ఈ ముక్కలను జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ కొబ్బరి మిశ్రమాన్ని కళాయిలోకి తీసుకుని వేడి చేయాలి. ఇందులోనే పంచదార, పాలు పోసి కలుపుతూ వేయించాలి. ఇలా 5 నిమిషాల పాటు వేయించిన తరువాత కొబ్బరి మిశ్రమం దగ్గరగా అవుతుంది. తరువాత నెయ్యి, యాలకుల పొడి వేసి కలపాలి. కొబ్బరి మిశ్రమం దగ్గరపడిన తరువాత చేతిలోకి కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని ఉండలా చుట్టి చూడాలి. కొబ్బరి మిశ్రమం ఉండలా చుట్టడానికి రాగానే స్టవ్ ఆఫ్ చేయాలి లేదంటే మరి కొద్ది సేపు వేయించాలి.
ఇలా వేయించిన తరువాత ఈ మిశ్రమాన్ని బటర్ పేపర్ వేసిన ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత పైన సమానంగా చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత మనకు కావల్సిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొకోనట్ బర్ఫీ తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు లేదా పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా బర్ఫీని తయారు చేసుకుని తినవచ్చు. ఈ బర్ఫీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.