Coconut Kulukki : మనం కొబ్బరి నీళ్లను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. కొబ్బరి నీళ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరాన్ని చల్లబరచడంలో, అలాగే శరీరానికి శక్తిని ఇవ్వడంలో, శరీరాన్ని డీ హైడ్రేషన్ బారిన పడకుండా చేయడంలో, అలాగే శరీరానికి కావల్సిన పోషకాలను అందించడంలో కొబ్బరి నీళ్లు ఎంతగానో సహాయపడతాయి. ఈ కొబ్బరి నీళ్లను నేరుగా తాగడానికి బదులుగా వీటితో కుల్కిని తయారు చేసుకుని తాగడం వల్ల శరీరం మరింత త్వరగా చల్లబడుతుంది. చల్ల చల్లగా, రుచిగా ఉండే కొకోనట్ కుల్కిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొకోనట్ కుల్కి తయారీకి కావల్సిన పదార్థాలు..
కొబ్బరి నీళ్లు – అర లీటర్, లేత కొబ్బరి ముక్కలు – పావు కప్పు, కెవ్డా( కెవ్రా) వాటర్ – 2 టేబుల్ స్పూన్స్, ఐస్ క్యూబ్స్ – 4.
కొకోనట్ కుల్కి తయారీ విధానం..
ముందుగా షేకర్ కప్పులో కొబ్బరి నీళ్లను వేసుకోవాలి. తరువాత ఇందులో కొబ్బరి బోండాలో ఉండే లేత కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. తరువాత కెవ్డా వాటర్ ను వేసుకోవాలి. ఇది అందుబాటులో లేని వారు ఒక టీ స్పూన్ రోజ్ వాటర్ ను కూడా వేసుకోవచ్చు. తరువాత పైన మూత పెట్టి అన్ని కలిసేలా బాగా కలుపుకోవాలి. తరువాత వీటిని గ్లాస్ లోకి తీసుకుని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొకోనట్ కుల్కి తయారవుతుంది. షేకర్ అందుబాటులో లేని వారు కొబ్బరి నీళ్లను బాటిల్ లో పోసి షేక్ చేసుకోవాలి. ఎండలో బయట తిరిగివచ్చినప్పుడు బయట దొరికే శీతల పానీయాలను తాగడానికి బదులుగా అప్పటికప్పుడు ఇలా కొబ్బరినీళ్లతో కుల్కిని తయారు చేసుకుని తాగడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.