Egg Noodles : మనకు రెస్టారెంట్ లలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లల్లో లభించే పదార్థాల్లో ఎగ్ నూడుల్స్ ఒకటి. ఎగ్ నూడుల్స్ చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా వీటిని తింటూ ఉంటారు. మనకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రుచితో ఈ నూడుల్స్ లభిస్తూ ఉంటాయి. అసలు అసలైన చైనీస్ ఎగ్ నూడుల్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చైనీస్ స్టైల్ ఎగ్ నూడుల్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూడుల్స్ రోల్స్ – 1, నూనె – 4 టేబుల్ స్పూన్స్, కోడిగుడ్లు – 2, క్యాబేజి తరుగు – అర కప్పు, క్యాప్సికం తరుగు – పావు కప్పు, క్యారెట్ తరుగు – అర కప్పు, ఉల్లిపాయ తరుగు – అర కప్పు, తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ – కొద్దిగా, పంచదార – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, అరోమాటిక్ పౌడర్ – ఒక టీ స్పూన్, వైట్ పెప్పర్ పౌడర్ – ఒక టీ స్పూన్, వెనిగర్ – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, లైట్ సోయా సాస్ – అర టీ స్పూన్.
చైనీస్ స్టైల్ ఎగ్ నూడుల్స్ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు బాగా కాగిన తరువాత నూడుల్స్ వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత వీటిని వడకట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ నూడుల్స్ పై ఒక టీ స్పూన్ నూనె వేసి కలుపుకోవాలి. తరువాత వీటిని పూర్తిగా చల్లారే వరకు పక్కకు ఉంచాలి. ఇప్పుడు లోతుగా ఉండే కళాయిలో నూనె వేసి పెద్ద మంటపై వేడి చేయాలి. నూనె వేడయ్యాక కోడిగుడ్లను బాగా బీట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని వేసిన వెంటనే కదపకుండా కొద్దిగా వేగిన తరువాత కలపాలి. తరువాత వీటిని గంటెతో పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి.
తరువాత క్యాబేజి, క్యాప్సికం, క్యారెట్, ఉల్లిపాయ తరుగు వేసి వేయించాలి. వీటిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత ఉడికించిన నూడుల్స్ ను వేసి కలపాలి. తరువాత మిగిలిన పదార్థాలన్నింటిని ఒక్కొక్కటిగా వేసి బాగా టాస్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చైనీస్ నూడుల్స్ తయారవుతాయి. టమాట కిచప్ తో తింటే ఈ నూడుల్స్ చాలా రుచిగా ఉంటాయి. వీటిని వేడి వేడిగా సర్వ్ చేస్తే అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.