Coconut Offering : హిందూ సాంప్రదాయంలో కొబ్బరికాయకు ఎంతో విశిష్టత ఉంటుంది. ఎటువంటి శుభకార్యాన్నైనా కొబ్బరికాయను కొట్టి ప్రారంభిస్తారు. కొబ్బరికాయ కొట్టనిదే పూజ సమాప్తం కాదు. ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ కొబ్బరికాయను అసలు దేవుడికి ఎందుకు కొట్టాలి.. కొబ్బరికాయ ఎలా పగిలితే మంచిది.. వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరికాయ పైన ఉండే పెంకు మనిషిలో ఉన్న అహంకారానికి ప్రతీక. భగవంతుని ముందు నిలబడి కొబ్బరికాయతో నమస్కరించి రాయిపైన కొబ్బరికాయను కొడతాం. అప్పుడు అహం అనే పెంకు పగిలి నిర్మలమైన తెల్లని కొబ్బరి, నీళ్లు బయటకు వస్తాయి.
భగవంతుడా.. నా అహాన్ని పటా పంచలు చేసి నిర్మలమైన కొబ్బరి వంటి నా మనసును నీ ముందు ఉంచుతున్నాను అని తెలియజేసే మర్మం.. కొబ్బరికాయ కొట్టడం వెనుక దాగి ఉంది. కొబ్బరికాయను పూర్ణ ఫలం అంటారు. దీనిలో ప్రతిభాగం మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. కొబ్బరికాయ పగలడం వెనుక కూడా అనేక నమ్మకాలు ఉన్నాయి. దేవాలయంలో కొబ్బరికాయ కొట్టినప్పుడు సమానంగా రెండు చిప్పలు వచ్చేలా పగిలితే మన మనసులో కోరుకున్న కోరిక త్వరలో నెరవేరుతుందని అర్థం.
సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులు కొబ్బరికాయ కొట్టినప్పుడు అది నిలువుగా పగిలితే త్వరలో సంతానం కలుగుతుందట. కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పూవు వస్తే త్వరలో శుభవార్త వింటారని సూచన. ఒకవేళ కొబ్బరికాయ కొట్టినప్పుడు లోపల కుళ్లిపోయి ఉంటే ఏదో కీడు జరగబోతుందని భావిస్తారు. కానీ అది అపోహ మాత్రమేనని పండితులు చెబుతున్నారు. కొబ్బరి కాయ కుళ్లిపోతే వెంటనే ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయాలి. తరువాత భగవంతున్ని ప్రార్థిస్తూ.. దీనిలో నా దోషం ఏమీ లేదని పూజించి.. మరో కొబ్బరికాయ కొట్టాలి. వాహనాలకు కొట్టిన కొబ్బరికాయ కుళ్లిపోతే ఏదో ప్రమాదం జరుగుతుందని భావించకూడదు. దిష్టిపోయిందని అర్థం. ఇలా కొబ్బరికాయను కొట్టడం వెనుక పలు అర్థాలు ఉన్నాయి.