Cabbage Fry : క్యాబేజి అంటే తిన‌ని వారు.. ఇలా చేసుకుంటే ఎంతో ఇష్టంగా తింటారు..!

Cabbage Fry : మ‌న‌లో చాలా మంది క్యాబేజిని తిన‌డానికి ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌రు. కానీ ఇందులో అనేక పోష‌కాలు ఉంటాయి. మాంగ‌నీస్‌, కాల్షియం, ఐర‌న్‌, పొటాషియం వంటి మిన‌ర‌ల్స్ తోపాటు విట‌మిన్ ఎ, విట‌మిన్ కె, విట‌మిన్ బి6 లు కూడా ఉంటాయి. క్యాబేజిని త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల నొప్పులు, వాపులు త‌గ్గుతాయి. క్యాబేజిని తిన‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

cook Cabbage Fry in this way everybody likes it
Cabbage Fry

మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించ‌డంలోనూ క్యాబేజి ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇందులో ఉండే విట‌మిన్ కె ర‌క్త నాళాల‌లో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌కుండా, గాయాలు అయిన‌ప్పుడు ర‌క్త స్రావం ఎక్కువ‌గా అవకుండా చేయ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. హైబీపీని, చెడు కొలెస్ట్రాల్(ఎల్‌డీఎల్‌)ను త‌గ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో కూడా క్యాబేజి ఉప‌యోగ‌ప‌డుతుంది. క‌నుక క్యాబేజిని ఆహారంలో భాగంగా చేసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

క్యాబేజిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌ని వారు కింద చెప్పిన విధంగా క్యాబేజిని వేపుడు చేసుకుని తిన‌వ‌చ్చు. ఇలా చేసుకోవ‌డం వ‌ల్ల క్యాబేజి వేపుడు చాలా రుచిగా ఉంటుంది. క్యాబేజిలో ఉండే పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. ఇక క్యాబేజి వేపుడును ఎలా త‌యారు చేసుకోవాలి, దాని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాబేజి వేపుడు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

క్యాబేజి – పావు కిలో, పెస‌ర ప‌ప్పు – 3 టేబుల్ స్పూన్స్‌, పొడుగ్గా త‌రిగిన ప‌చ్చి మిర్చి – 2, వెల్లుల్లి రెబ్బ‌లు – 4 లేదా 5 (కచ్చ‌ప‌చ్చ‌గా చేసుకున్న‌వి), జీల‌క‌ర్ర – అర టీ స్పూన్‌, ఆవాలు – అర టీ స్పూన్, నూనె – 2 టీ స్పూన్స్‌, క‌రివేపాకు – ఒక రెబ్బ‌, ఉప్పు – రుచికి స‌రిప‌డా, ప‌సుపు – పావు టీ స్పూన్‌, కారం – రుచికి స‌రిప‌డా, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

క్యాబేజి వేపుడు త‌యారీ విధానం..

ముందుగా క్యాబేజిని చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి శుభ్రంగా క‌డిగి ప‌క్క‌కు పెట్టుకోవాలి. పెస‌ర ప‌ప్పును కూడా కడిగి అర గంట సేపు నాన‌బెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి కాగాక జీల‌క‌ర్ర‌, ఆవాలు, త‌రిగిన ప‌చ్చి మిర్చి, వెల్లుల్లి రెబ్బ‌లు, క‌రివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక క‌ట్ చేసి పెట్టుకున్న క్యాబేజిని, నాన‌బెట్టుకున్న పెస‌ర‌ప‌ప్పును వేసి బాగా క‌లుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మ‌ధ్య‌స్థ మంట‌పై క్యాబేజిని ఉడికించాలి.

పెస‌ర‌ప‌ప్పు ఉడ‌క‌న‌ట్టుగా ఉంటే కొద్దిగా నీటిని చల్లి ఉడికించాలి. క్యాబేజి, పెస‌ర ప‌ప్పు పూర్తిగా ఉడికిన త‌రువాత ప‌సుపు, ఉప్పు, కారం, ధ‌నియాల పొడి వేసి బాగా క‌లుపుకోవాలి. ఇలా క‌లిపిన త‌రువాత 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచి మ‌ళ్లీ ఉడికించాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌ను వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్యాబేజి వేపుడు త‌యారవ‌డ‌మే కాకుండా క్యాబేజీలో ఉండే పోష‌కాలు ఎక్కువ‌గా పోకుండా ఉంటాయి. దీనిని చ‌పాతీతో లేదా అన్నంతో క‌లిపి తిన‌వ‌చ్చు. క్యాబేజి వేపుడును ఈ విధంగా త‌యారు చేయ‌డం వ‌ల్ల రుచిగా ఉండ‌డ‌మే కాకుండా, అందులో ఉండే పోష‌కాలు కూడా శ‌రీరానికి అందుతాయి.

D

Recent Posts