Corn Dosa : మొక్కజొన్నలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటిని ఉడకబెట్టి లేదా వేయించి తింటారు. వీటితో గారెలు కూడా చేస్తారు. అయితే మొక్కజొన్నతో దోశలను కూడా తయారు చేయవచ్చు. ఇవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని చేయడం కూడా సులభమే. మొక్కజొన్న దోశలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మొక్కజొన్న దోశల తయారీకి కావల్సిన పదార్థాలు..
మొక్కజొన్నలు – మూడు కప్పులు, ఎండు మిర్చి – రెండు, పచ్చి మిర్చి – రెండు, మినప పప్పు – పావు కప్పు, జీలకర్ర – ఒక టీస్పూన్, కరివేపాకు – కొద్దిగా, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – తగినంత.
మొక్కజొన్న దోశలను తయారు చేసే విధానం..
మొక్కజొన్నలు, మినప పప్పును అర గంట పాటు నానబెట్టాలి. తరువాత మిక్సీలో వేసి మెత్తగా పట్టుకోవాలి. అందులో ఎండు మిర్చి, పచ్చి మిర్చి, కరివేపాకు, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఇందులో అవసరం అయినంత మేర నీళ్లు కలిపి దోశ పిండిలా తయారు చేయాలి. తరువాత ఒక పాన్ తీసుకుని నూనె వేయాలి. నూనె వేడయ్యాక పిండిని తీసుకుని దోశలా వేయాలి. దీన్ని నూనె వేస్తూ రెండు వైపులా కాల్చుకోవాలి. దోశ బంగారు రంగులోకి మారేంత వరకు కాల్చాలి. తరువాత ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే.. మొక్కజొన్న దోశ రెడీ అవుతుంది. దీన్ని ఏ చట్నీతో కలిపి తిన్నా రుచి అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడూ రొటీన్ దోశలు కాకుండా ఈసారి మొక్కజొన్నలతో దోశలను కొత్తగా ట్రై చేయండి. బాగుంటాయి. అందరూ ఇష్టంగా తింటారు.