Pooja : ప్రతి పురుషుని విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందని కొందరంటే.. ప్రతి స్త్రీ విజయం వెనుక కూడా ఓ పురుషుడు ఉంటాడని కొందరు అంటారు. సరే ఈ విషయం ఎలా ఉన్నా పూజలు, యాగాలు చేసినప్పుడు, దేవాలయాలను సందర్శించినప్పుడు మాత్రం దంపతులిద్దరూ కలిసే ఆ పనులు చేయాలని హిందూ పురాణాలు చెబుతున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. అయితే దీని వెనుక ఉన్న కారణాలేంటో, పురాణాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం స్త్రీని శక్తితో పోల్చారు. కనుక శక్తి రూపంలో ఉండే స్త్రీ పక్కన ఉండగా పూజ చేస్తే ఆ పురుషునికి అన్నింటా విజయం సిద్దిస్తుందట. అందుకే దంపతులిద్దరూ కలసి పూజలు చేయాలని, దేవాలయాలను దర్శించాలని చెబుతున్నారు.
దంపతులిద్దరూ ఒకరి శరీరంలో మరొకరు సగభాగం అంటారు. అందుకు పరమశివున్ని అర్థనారీశ్వరుని రూపంలో కొలుస్తారు. ఈ క్రమంలో వారు కష్ట సుఖాల్లోనే కాదు, పూజలు చేసినప్పుడు, ఆలయాల వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు కలిసే ఆ పనులు చేస్తే దాంతో ఆ ఫలితం ఇద్దరికీ కలుగుతుందట. కృత, త్రేతా, ద్వాపర యుగాల్లో చాలా మంది రాజులు తమ భార్యలు పక్కన లేనప్పుడు వారికి చెందిన బంగారు విగ్రహాలతో పూజలు చేసే వారు కదా. అలాగే ఇప్పుడు కూడా భార్యాభర్తలిద్దరూ చేయాలట. దాంతో ఆ యాగ ఫలితం సంపూర్ణంగా వారికి దక్కుతుందట.
పెళ్లి చేసుకున్నప్పుడు దంపతులిద్దరూ అన్ని విషయాల్లోనూ ఇద్దరూ సమంగా పాలు పంచుకుంటామని పంచ భూతాల సాక్షిగా ప్రమాణం చేస్తారు కదా. మరి అలాంటప్పుడు పుణ్యక్షేత్రాల సందర్శన, పూజలు చేసినప్పుడు కూడా భార్యభర్తలిద్దరూ పాల్గొంటేనే అది పరిపూర్ణం అయి ఫలితం దక్కుతుంది. లేదంటే సగం ఫలమే దక్కుతుంది. కనుక పూజలు చేసినా.. ఆలయాలను సందర్శించినా.. దంపతులు ఇద్దరూ కలిసే వాటిని చేస్తే.. పూర్తి స్థాయిలో ఫలితాన్ని పొందవచ్చు.