Crispy Alu Fry : మనం తరచూ బంగాళాదుంపలను ఉపయోగించి వంటింట్లో రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. బంగాళా దుంపలతో చేసే ఏ వంటకమైనా సరే చాలా రుచిగా ఉంటుంది. బంగాళా దుంపలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. విటమిన్ సి, విటమిన్ బి6 లతోపాటు కాపర్, మాంగనీస్ వంటి మినరల్స్ కూడా బంగాళాదుంపలలో అధికంగా ఉంటాయి. మలబద్దకాన్ని తగ్గించడంలో, కాలేయం పని తీరును మెరుగుపరచడంలో, మూత్ర పిండాలలో రాళ్లు ఏర్పకుండా చేయడంలో బంగాళా దుంపలు ఎంతో సహాయపడతాయి.
మనం ఎక్కువగా బంగాళా దుంపలతో ఫ్రై ని తయారు చేస్తూ ఉంటాం. హోటల్స్ లో చేసే బంగాళా దుంపల ఫ్రై చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటుంది. ఇంట్లో కూడా మనం చాలా సులువుగా హోటల్స్ లో ఉండే విధంగా తయారు చేసుకోవచ్చు. రుచిగా, క్రిస్పీగా బంగాళాదుంపల ఫ్రై ని ఎలా తయారు చేయాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
క్రిస్పీ ఆలూ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
బంగాళా దుంపలు – 750 గ్రా., కారం – అర టేబుల్ స్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, గరం మసాలా – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, టేస్టింగ్ సాల్ట్ – చిటికెడు, ఫుడ్ కలర్ – చిటికెడు, పొడుగ్గా తరిగిన పచ్చి మిర్చి – 4, కరివేపాకు – రెండు రెబ్బలు, శనగ పిండి – ఒక టేబుల్ స్పూన్, బియ్యం పిండి – ఒక టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
క్రిస్పీ ఆలూ ఫ్రై తయారీ విధానం..
ముందుగా బంగాళాదుంపలపై ఉండే పొట్టును తీసి శుభ్రంగా కడిగి మరీ సన్నగా, మరీ లావుగా కాకుండా మధ్యస్థంగా ఉండేలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బంగాళా దుంపలను నీటిలో వేసి రెండు సార్లు శుభ్రం చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి నీళ్లను వేయకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి కాగిన తరువాత కలిపి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను వేసి 2 నిమిషాల పాటు పెద్ద మంటపై వేయించి, 2 నిమిషాల తరువాత చిన్న మంటపై క్రిస్పీగా అయ్యే వరకు వేయించి టిష్యూ ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల క్రిస్పీ ఆలూ ఫ్రై తయారవుతుంది. వీటిని టమాటా కెచప్ తో నేరుగా లేదా పప్పు, చారు వంటి కూరలతో కలిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా చేయడం వల్ల హోటల్ లో చేసిన విధంగా ఉండేలా ఆలూ ఫ్రై తయారవుతుంది. వీటిని తింటే ఎంతో రుచిగా ఉంటాయి.