Crispy Moong Dal : మనం పెసరపప్పుతో రకరకాల కూరలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. పెసరపప్పుతో చేసే కూరలను తినడం వల్ల రుచితో పాటు పెసరపప్పులోని పోషకాలను కూడా పొందవచ్చు. కేవలం కూరలే కాకుండా పెసరపప్పుతో చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. పెసరపప్పుతో చేసుకోదగిన చిరుతిళ్లల్లో క్రిస్పీ మూంగ్ దాల్ ఒకటి. ఇది మనకు బయట షాపుల్లో ప్యాకెట్ ల రూపంలో లభిస్తుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. షాపుల్లో లభించే విధంగా ఉండే మూంగ్ దాల్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో మూంగ్ దాల్ ను రుచిగా, కరకరలాడుతూ ఉండేలా ఎలా తయారు చేసుకోవాలి…తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్రిస్పీ మూంగ్ దాల్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసరపప్పు – ముప్పావు కప్పు, బేకింగ్ సోడా – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, ఉప్పు – తగినంత.
క్రిస్పీ మూంగ్ దాల్ తయారీ విధానం..
ముందుగా పెసరపప్పును ఒక గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత ఇందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఈ నీటిలో బేకింగ్ సోడా వేసి కలపాలి. తరువాత ఈ పెసరపప్పుపై మూతను ఉంచి దీనిని మూడు నుండి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తరువాత పప్పును ఒక జల్లిగిన్నెలోకి తీసుకుని నీళ్లు అన్నీ పోయేలా చూసుకోవాలి. తరువాత ఈ పప్పును ఒక కాటన్ వస్త్రంపై వేసి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇప్పపుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఒక జల్లిగంటెలో ఆరబెట్టుకున్న పెసరపప్పును కొద్ది పరిమాణంలో తీసుకోవాలి. తరువాత ఈ గంటెను పప్పుతో సహా నూనెలో ఉంచి పప్పును వేయించుకోవాలి.
ఈ పెసరపప్పును ఎర్రగా అయ్యి కరకరలాడే వరకు వేయించుకుని టిష్యూ పేపర్లు ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఈ పప్పును ఒక గిన్నెలోకి తీసుకుని తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా కరకరలాడుతూ ఉండే మూంగ్ దాల్ తయారవుతుంది. ఇలా మూంగ్ దాల్ ను తయారు చేసుకుని స్నాక్స్ గా తినవచ్చు. అలాగే దీనిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల చాలా రోజుల వరకు తాజాగా ఉంటుంది. ఈ మూంగ్ దాల్ లో కారం, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కూడా తినవచ్చు.