Hotel Style Veg Biryani : వెజ్ బిర్యానీ.. కూరగాయ ముక్కలు వేసి చేసే ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. రెస్టారెంట్ లలో కూడా ఈ బిర్యానీ మనకు లభిస్తుంది. దీనిని చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వెజ్ బిర్యానీని మనం తరచూ ఇంట్లో కూడా తయారు చేస్తూ ఉంటాం. ఈ వెజ్ బిర్యానీని రుచిగా, వంటరాని వారు కూడా చేసుకునేంత సులభంగా , చక్కగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వెజ్ బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన బియ్యం – రెండున్నర గ్లాసులు, నీళ్లు – 3 గ్లాసులు, పొడుగ్గా ముక్కలుగా తరిగిన క్యారెట్ – 1, తరిగిన క్యాప్సికం – 1, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 6, తరిగిన బీన్స్ – 5, పెద్ద ముక్కలుగా తరిగిన వంకాయలు – 3, పెద్ద ముక్కలుగా తరిగిన బంగాళాదుంపలు – 2, నూనె – 3 టీ స్పూన్స్, నెయ్యి – 2 టీ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, బిర్యానీ ఆకులు – 2, తరిగిన పుదీనా – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, కసూరి మెంతి – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, బిర్యానీ మసాలా – ఒకటిన్నర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత.
వెజ్ బిర్యానీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. ఇవి వేడయ్యాక జీలకర్ర, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, బంగాళాదుంప ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత కొత్తిమీర, పుదీనా , కసూరి మెంతి, అల్లం పేస్ట్ వేసి కలపాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత బీన్స్, క్యాప్సికం, పచ్చిమిర్చి, వంకాయ ముక్కలు వేసి కలపాలి. తరువాత బిర్యానీ మసాలా, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలిపి మూత పెట్టి కూరగాయ ముక్కలను బాగా మగ్గించాలి. తరువాత నానబెట్టుకున్న బియ్యానీ వేసి కలపాలి. ఈ బియ్యాన్ని మూత పెట్టి 2 నిమిషాల అలాగే ఉంచాలి. తరువాత నీళ్లు, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు దీనిని నీళ్లు అన్ని పోయి దగ్గర పడే వరకు మధ్యస్థ మంటపై ఉడికించాలి. తరువాత మంటను చిన్నగా చేసి మరో 5 నుండి 8 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తరువాత మూత తీయకుండా పది నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ బిర్యానీ తయారవుతుంది. ఈ వెజ్ బిర్యానీలో ఇతర కూరగాయ ముక్కలను కూడా వేసుకోవచ్చు. దీనిని రైతా, మిర్చి కా సాలన్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లోలేదా అప్పుడప్పుడు ఇలా వెజ్ బిర్యానీని తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు కూరగాయ ముక్కల్లోని పోషకాలను కూడా పొందవచ్చు.