Bellam Ravva Laddu : బెల్లంతో చేసిన ర‌వ్వ ల‌డ్డూల‌ను ఎప్పుడైనా తిన్నారా.. రుచి చూస్తే స్వ‌యంగా త‌యారు చేస్తారు..

Bellam Ravva Laddu : బొంబాయి ర‌వ్వ‌తో ఉప్మానే కాకుండా ఇత‌ర చిరుతిళ్లు, తీపి ప‌దార్థాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ర‌వ్వ‌తో చేసుకోద‌గిన తీపి ప‌దార్థాలు అన‌గానే అంద‌రికి ముందుగా గుర్తుకు వ‌చ్చేవి ర‌వ్వ ల‌డ్డూలు. ర‌వ్వ ల‌డ్డూలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఈ ర‌వ్వ ల‌డ్డూల‌ను మ‌నం ఎక్కువ‌గా పంచ‌దార‌తో త‌యారు చేస్తాము. పంచ‌దారే కాకుండా బెల్లంతో కూడా మ‌నం ఈ ర‌వ్వ ల‌డ్డూల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. బెల్లంతో ర‌వ్వ ల‌డ్డూలు కూడా చాలా రుచిగా ఉంటాయి. బెల్లాన్నిఉప‌యోగించి ర‌వ్వ‌తో ల‌డ్డూల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి… అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బెల్లం ర‌వ్వ ల‌డ్డూల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బొంబాయి ర‌వ్వ – 2 క‌ప్పులు, పాలు – ఒక క‌ప్పు, బెల్లం తురుము – ఒక క‌ప్పు, యాల‌కులు – 3, నెయ్యి – 2 టీ స్పూన్స్, డ్రై ఫ్రూట్స్ – త‌గినన్ని.

Bellam Ravva Laddu recipe in telugu how to make them
Bellam Ravva Laddu

బెల్లం ర‌వ్వ ల‌డ్డూల త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో బొంబాయి ర‌వ్వ‌ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో కొద్ది కొద్దిగా పాల‌ను పోస్తూ మెత్త‌గా క‌లుపుకోవాలి. ఇలా క‌లిపిన త‌రువాత దీనిపై మూత‌ను ఉంచి 15 నిమిషాల పాటు ర‌వ్వ‌ను నాన‌నివ్వాలి. 15 నిమిషాల త‌రువాత ర‌వ్వ‌ను మ‌రోసారి బాగా క‌లుపుకోవాలి. ఇప్పుడు ర‌వ్వ మిశ్ర‌మాన్ని ఉండలుగా చేసుకోవాలి. త‌రువాత ఒక్కో ఉండ‌ను తీసుకుంటూ నూనె వేసుకుంటూ చ‌పాతీలా వ‌త్తుకోవాలి. ఇలా చ‌పాతీలా వ‌త్తుకున్న త‌రువాత వాటిని పెనం మీద వేసి నూనె వేసుకుంటూ రెండు వైపులా దోర‌గా కాల్చుకోవాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత వాటిని ముక్క‌లుగా చేసి ఒక జార్ లోకి తీసుకోవాలి. త‌రువాత వీటిని మ‌రీ మెత్త‌గా కాకుండా కొద్దిగా బ‌ర‌క‌గా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ ప‌ట్టుకున్న ర‌వ్వ మిశ్ర‌మాన్ని కొద్దిగా జార్ లోనే ఉంచి మిగిలిన దానిని ఒక గిన్న‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు జార్ లో బెల్లం తురుము, యాల‌కులు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇలా ర‌వ్వ మిశ్ర‌మాన్ని ఉంచి మిక్సీ ప‌ట్టుకోవ‌డం వ‌ల్ల బెల్లం మెత్త‌గా కాకుండా ఉంటుంది.

ఈ బెల్లం మిశ్ర‌మాన్ని కూడా ర‌వ్వ మిశ్ర‌మంలో వేసి అంతా క‌లిసేలా బాగా క‌లుపుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కాగిన త‌రువాత అందులో మ‌న రుచికి త‌గిన‌ట్టు డ్రై ఫ్రూట్స్ ను వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న డ్రైఫ్రూట్స్ ను ర‌వ్వ మిశ్ర‌మంలో వేసి క‌లుపుకోవాలి. ఇప్పుడు త‌గిన ప‌రిమాణంలో ర‌వ్వ మిశ్ర‌మాన్ని తీసుకుంటూ ల‌డ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బెల్లం ర‌వ్వ ల‌డ్డూలు త‌యార‌వుతాయి. వీటిని త‌యారు చేసుకుని స్నాక్స్ గా తిన‌వ‌చ్చు. పంచ‌దార వేసి చేసే ర‌వ్వ ల‌డ్డూల కంటే బెల్లం వేసి చేసే ర‌వ్వ ల‌డ్డూలే చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి హాని క‌ల‌గ‌కుండా ఉంటుంది. ఈ ల‌డ్డూల‌ను పిల్ల‌లు మ‌రింత ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts