Crispy Onion Rings : మనం వంట్లలో ఉల్లిపాయలను విరివిగా వాడుతూ ఉంటాము. ఉల్లిపాయలు వేయడం వల్ల వంటల రుచి పెరుగుతుంది. అలాగే ఉల్లిపాయలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వంటల్లో వాడడంతో పాటు ఉల్లిపాయలతో మనం చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. ఉల్లిపాయలతో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో ఆనియన్ రింగ్స్ కూడా ఒకటి. ఈ రింగ్స్ చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. తరుచూ ఒకేరకం స్నాక్స్ కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు. పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. క్రిస్పీగా, రుచిగా ఉండే ఈ ఆనియన్ రింగ్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆనియన్ రింగ్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదాపిండి – అర కప్పు, ఉప్పు – కొద్దిగా, గుండ్రంగా కట్ చేసిన పెద్ద ఉల్లిపాయ – 1, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, మిరియాల పొడి – అర టీ స్పూన్, వెల్లుల్లి పొడి – అర టీ స్పూన్, బ్రెడ్ క్రంబ్స్ – ఒక కప్పు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
ఆనియన్ రింగ్స్ తయారీ విధానం..
ముందుగా ఉల్లిపాయను మరీ పలుచగా కాకుండా గుండ్రటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఒక్కో ఉల్లిపాయ ముక్కను విడివిడిగా చేసి పక్కకు ఉంచాలి. తరువాత ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. ఇందులో ఉప్పు వేసి కలపాలి. తరువాత ఇందులో ఉల్లిపాయ ముక్కలను వేసి పైన మూత పెట్టి బాగా కదపాలి. తరువాత మూత తీసి కొద్దిగా నీటిని చల్లుకుని మరలా బాగా కదపాలి. ఇలా చేయడం వల్ల పిండి రింగ్స్ కు చక్కగా పడుతుంది. ఇప్పుడు ఈ రింగ్స్ ను ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. మిగిలిన పిండిలో కార్న్ ఫ్లోర్, మిరియాల పొడి, వెల్లుల్లి పొడి వేసి కలపాలి. వెల్లుల్లి పొడి అందుబాటులో లేని వారు వెల్లుల్లి రెబ్బలను మెత్తని పేస్ట్ లాగా చేసుకుని వేసుకోవచ్చు. తరువాత ఈ పిండిలో నీళ్లు పోసి పలుచగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న రింగ్స్ ను పిండిలో ముంచి బ్రెడ్ క్రంబ్స్ లో వేసుకోవాలి.
ఈ రింగ్స్ కు బ్రెడ్ క్రంబ్స్ ను బాగా పట్టించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత వీటిని జిప్ లాక్ కవర్ లో వేసి డీఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవచ్చు. ఇవి 2 నుండి 3 వారాల వరకు తాజాగా ఉంటాయి. ఎప్పుడూ పడితే అప్పుడు వీటిని నూనెలో వేయించి తీసుకోవచ్చు. లేదంటే బ్రెడ్ క్రంబ్స్ తో కోటింగ్ చేసిన తరువాత వెంటనే వేడి వేడి నూనెలో వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై 2 నుండి 3 నిమిషాల పాటు వేయించి గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆనియన్ రింగ్స్ తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటుంది. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి.