Dahi Aloo Masala Curry : పెరుగు, ఆలూతో ఇలా మసాలా కర్రీ చేయండి.. రైస్, చపాతీ, పులావ్ లోకి బాగుంటుంది..

Dahi Aloo Masala Curry : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాలను త‌యారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. బంగాళాదుంప‌ల‌తో రుచిగా ఉండ‌డంతో పాటు చాలా సుల‌భంగా చేసుకోద‌గిన కూర‌ల్లో ద‌హీ ఆలూ మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి. పెరుగు, బంగాళాదుంప‌లు క‌లిపి చేసే ఈ మ‌సాలా క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు, మొద‌టిసారిగా చేసే వారు ఎవ‌రైనా కూడా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ద‌హీ ఆలూ మ‌సాలా క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ద‌హీ ఆలూ మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన చిన్న బంగాళాదుంప‌లు – పావు కిలో, త‌రిగిన ట‌మాట – 1, పెరుగు – ఒక క‌ప్పు, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 3, యాల‌కులు – 3, జీడిప‌ప్పు – 10, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, క‌రివేపాకు – ఒక టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, గ‌స‌గ‌సాలు – ఒక టేబుల్ స్పూన్.

Dahi Aloo Masala Curry recipe in telugu very tasty how to make it
Dahi Aloo Masala Curry

ద‌హీ ఆలూ మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా జార్ లో నువ్వులు, జీడిప‌ప్పు, గ‌స‌గ‌సాలు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత పెరుగులో ధ‌నియాల పొడి, గరం మ‌సాలా, ఉప్పు, కారం, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ‌లు ఎర్ర‌గా వేగిన త‌రువాత మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత టమాట ముక్క‌లు వేసి టమాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌గా ఉడికిన త‌రువాత ముందుగా సిద్దం చేసుకున్న పెరుగు, మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌ల‌పాలి.

దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించిన త‌రువాత బంగాళాదుంప‌ల‌ను వేసి క‌ల‌పాలి. త‌రువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, క‌సూరి మెంతి, కొత్తిమీర వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ద‌హీ ఆలూ మ‌సాలా క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ, పులావ్ వంటి వాటితో కూడా క‌లిపి తిన‌వ‌చ్చు. బంగాళాదుంప‌ల‌తో త‌రచూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా మ‌సాలా కూర‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. బంగాళాదుంప‌ల‌తో చేసిన ఈ మ‌సాలా కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts