Dates Kheer : ఖ‌ర్జూరాల‌తోనూ ఎంతో రుచిక‌ర‌మైన పాయ‌సాన్ని ఇలా చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎలాగంటే..?

Dates Kheer : మ‌నం ఖ‌ర్జూర పండ్ల‌ను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. ఖ‌ర్జూర పండ్లు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. వీటిలో ఉండే పోష‌కాలు మ‌నకు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించ‌డంలో ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. ఈ ఖ‌ర్జూర పండ్ల‌ను నేరుగా తిన‌డంతో పాటు వీటిని తీపి వంట‌కాల త‌యారీలో కూడా వాడుతూ ఉంటాం. అలాగే వీటితో మ‌నం ఎంతో రుచిక‌ర‌మైన పాయ‌సాన్ని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. నూనె, నెయ్యి వేయ‌కుండా చేసే ఈ పాయ‌సం చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. ఖ‌ర్జూర పండ్ల‌తో ఆరోగ్యానికి మేలు చేసే క‌మ్మటి పాయ‌సాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఖ‌ర్జూర పండ్ల పాయ‌సం త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

ఖ‌ర్జూర పండ్లు – ఒక క‌ప్పు, బియ్యం – ఒక టేబుల్ స్పూన్, బెల్లం తురుము – పావు క‌ప్పు, కొబ్బ‌రి పాలు – రెండు క‌ప్పులు, డ్రై ఫ్రూట్స్ ముక్క‌లు – త‌గిన‌న్ని, యాల‌కుల పొడి – అర టీ స్పూన్.

Dates Kheer recipe in telugu make in this way
Dates Kheer

ఖ‌ర్జూర పండ్ల పాయ‌సం త‌యారీ విధానం..

ముందుగా ఖ‌ర్జూర పండ్ల‌ల్లో వేడి నీళ్లు పోసి అర‌గంట పాటు నాన‌బెట్టాలి. అలాగే బియ్యంతో కూడా త‌గినన్ని నీళ్లు పోసి అర‌గంట పాటు నాన‌బెట్టాలి. త‌రువాత ఖ‌ర్జూర పండ్లల్లో ఉండే గింజ‌లు తీసేసి వాటిని జార్ లో వేసుకోవాలి.ఇందులోనే అర‌ క‌ప్పు నీళ్లు పోసి మెత్త‌ని పేస్ట్ లాగా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత అదే జార్ లో నాన‌బెట్టిన బియ్యాన్ని నీటితో స‌హా తీసుకోవాలి. అలాగే బెల్లం తురుము కూడా వేసి మెత్త‌గా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని క‌ళాయిలోకి తీసుకుని అందులో ఒక క‌ప్పు కొబ్బ‌రి పాలు, అర క‌ప్పు నీళ్లు పోసి క‌లపాలి. ఈ క‌ళాయిని స్ట‌వ్ మీద ఉంచి చిన్న మంట‌పై క‌లుపుతూ ఉడికించాలి. దీనిని ఉడుకు ప‌ట్టే వ‌ర‌కు ఉడికించిన త‌రువాత డ్రై ఫ్రూట్స్ వేసి క‌ల‌పాలి.

త‌రువాత మ‌రో క‌ప్పు కొబ్బ‌రి పాలు పోసి క‌ల‌పాలి. దీనిని కూడా ఉడుకుప‌ట్టే వ‌ర‌కు ఉడికించిన త‌రువాత యాల‌కుల పొడి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఖ‌ర్జూర పండ్ల పాయ‌సం త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడిగా లేదా ఫ్రిజ్ లో ఉంచి చ‌ల్లారిన త‌రువాత కూడా తిన‌వ‌చ్చు. ఈ విధంగా ఖ‌ర్జూర పండ్ల‌తో చేసిన పాయ‌సాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. నీర‌సం, బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts