Dhaba Style Tomato Curry : మనకు ధాబాలలో లభించే కర్రీలల్లో టమాట కర్రీ కూడా ఒకటి. దీనిని ఎక్కువగా చపాతీ, రోటీ, నాన్ వంటి వాటితో సర్వ్ చేస్తూ ఉంటారు. ధాబాలల్లో చేసే ఈ టమాట కర్రీ చాలా రుచిగా ఉంటుంది. తక్కువ పదార్థాలు వేసి చేసినప్పటికి టమాట కర్రీ మాత్రం చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీని అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. ఎతో కమ్మగా, రుచిగా ఉండే ఈ టమాట కర్రీని ధాబా స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ధాబా స్టైల్ టమాట కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 50 గ్రా., జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 3, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 100 గ్రా., తరిగిన పచ్చిమిర్చి- 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, టమాట ఫ్యూరీ – 200 గ్రా., కరివేపాకు – రెండు రెమ్మలు, పెద్ద ముక్కలుగా తరిగిన టమాటాలు – పావు కిలో, నీళ్లు – 200 ఎమ్ ఎల్.
ధాబా స్టైల్ టమాట కర్రీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. ఇవి వేగిన తరువాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత గరం మసాలా, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కలపాలి. వీటిని బాగా వేయించిన తరువాత టమాట ఫ్యూరీ, కరివేపాకు వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు ఉడికించిన తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. టమాట ముక్కలను పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ నూనె పైకి తేలే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం ఎంతో రుచిగా ఉండే టమాట కర్రీ తయారవుతుంది.దీనిని అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. తరుచూ ఒకేరకం టమాట కర్రీ కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు.