Dhoni : మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరు చెప్పగానే సహజంగానే ఎవరికైనా సరే.. ధోనీ జులపాల జుట్టుతోపాటు ఆయన కొట్టే హెలికాప్టర్ షాట్స్ గుర్తుకు వస్తాయి. అలాగే ఆయన ధరించే జెర్సీలపై ఉండే నంబర్ 7 కూడా గుర్తుకు వస్తుంది. భారత్ తరఫున ఆడిన అంతర్జాతీయ మ్యాచ్‌లతోపాటు దేశీయ మ్యాచ్‌లు.. ఆఖరికి ఐపీఎల్ మ్యాచ్‌లలోనూ ధోనీ జెర్సీ నంబర్ 7 గానే ఉంటుంది. అయితే ఈ నంబర్‌నే తాను ఎంచుకున్నాడో.. ధోనీ తాజాగా చెప్పేశాడు.
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టు యాజమాన్యం ఇండియా సిమెంట్స్ ఐపీఎల్ నేపథ్యంలో ధోనీతో వర్చువల్‌గా సమావేశం నిర్వహించింది. అందులో భాగంగా మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలు అడిగారు. ఇక తన జెర్సీలపై నంబర్ 7 ఎందుకు ఉంటుందో చెప్పాలని కూడా కోరారు. దీనికి ధోనీ స్పందించాడు.
తాను జూలై 7వ తేదీన జన్మించానని.. కనుక తన లక్కీ నంబర్ 7 అని అందరూ అనుకుంటారని.. కాబట్టే ధోనీ తన జెర్సీపై నంబర్ 7ను వేసుకుంటున్నాడని.. చాలా మంది అనుకుంటుంటారు. కానీ అందులో నిజం లేదు. జెర్సీపై ఏ నంబర్ కావాలని అడిగినప్పుడు.. లక్కీ నంబర్ ఏది ఉంటుంది ? అని అడిగాను. అందుకు ఎదుటి వారు సమాధానం చెప్పలేదు. కనుక నా పుట్టిన తేదీనే ఎంచుకుంటున్నాను, నాకు లక్కీ నంబర్ అంటూ ఏదీ లేదు.. అని ధోనీ చెప్పాడు.
ఇక 7 అనేది న్యూట్రల్ నంబర్ అని.. తటస్థంగా ఉంటుందని.. అది ఎవరిపైనా ప్రభావం చూపించదని.. న్యూమరాలజీ ప్రకారం తెలుసుకున్నానని.. కనుకనే ఆ నంబర్‌ను జెర్సీలపై వేసుకుంటున్నానని.. ధోనీ తెలియజేశాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 26వ తేదీన ప్రారంభం కానుండగా.. మొదటి మ్యాచ్ చెన్నైకి, కోల్‌కతాకి మధ్య ముంబైలోని వాంఖెడె స్టేడియంలో జరగనుంది. ఈ ఐపీఎల్ ధోనీకి చివరిదని భావిస్తున్నారు.