Sai Pallavi : ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి నటిగా, డ్యాన్సర్‌గా తనకంటూ ఓ గుర్తింపును సొంతం చేసుకున్న సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినీ రంగంలో ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటుంది. ఇక తాజాగా దర్శకుడు సుకుమార్ ఈమెను ఆకాశానికెత్తేశారు. సాయిపల్లవిని లేడీ పవన్ కల్యాణ్ అని సంబోధించారు.
శర్వానంద్, రష్మిక మందన్నలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ ఆడాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమాకు చెందిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు దర్శకుడు సుకుమార్, సాయిపల్లవిలు చీఫ్ గెస్ట్‌లుగా హాజరయ్యారు. గతంలో సాయిపల్లవి శర్వానంద్‌తో కలిసి పడి పడి లేచె మనసు మూవీలో నటించింది. అందుకని ఈమెను ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా పిలిచారు. ఇక ఈ ఈవెంట్‌లో సాయిపల్లవిని సుకుమార్ పొగిడారు.
సాయిపల్లవి కేవలం ఒక గొప్ప నటి, డ్యాన్సర్ మాత్రమే కాదు.. మానవత్వం ఉన్న మనిషని అన్నారు. ఓ ఫెయిర్ నెస్ కంపెనీ వారు తమ యాడ్స్‌లో నటించేందుకు భారీ మొత్తం ఇస్తామన్నా సాయిపల్లవి అందుకు ఒప్పుకోలేదని.. అక్కడే ఆమె గొప్పతనం బయట పడిందని సుకుమార్ అన్నారు. ఆమెకు ఎంతో మంది అభిమానులు ఉన్నారని.. ఆమె ఒక లేడీ పవన్ కల్యాణ్.. అని సుకుమార్ ప్రశంసించారు. దీంతో ప్రాంగణం మొత్తం చప్పట్లు, ఈలలు, కేకలతో మారుమోగింది.
కాగా సాయిపల్లవి ఇటీవలే నాగచైతన్యతో కలిసి లవ్ స్టోరీ సినిమాలో నటించగా.. అది బంపర్ హిట్ అయింది. ఆ తరువాత వచ్చిన శ్యామ్ సింగరాయ్ చిత్రంలోనూ ఆమె తన నటనతో ఆకట్టుకుంది. ఇక ఈమె నటించిన విరాట పర్వం మూవీ త్వరలో విడుదల కానుంది.