RRR : ప్రతి ఏడాది వేసవి సీజన్ వస్తుందంటే చాలు.. మన దేశంలోని సినీ పరిశ్రమలకు గుబులు పట్టుకుంటుంది. ఎందుకంటే.. ఈ సీజన్‌లో ఐపీఎల్ ఉంటుంది కదా.. కనుక సినిమాలను విడుదల చేయాలా.. వద్దా.. అని సందేహిస్తుంటారు. ఇక కొందరు ధైర్యం చేసి సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. కొందరు ఐపీఎల్ ముగిశాక నెమ్మదిగా మూవీలను విడుదల చేస్తుంటారు. ఐపీఎల్ వల్ల సినిమాల కలెక్షన్లపై ప్రభావం పడుతుంది కనుక.. ఈ సీజన్‌లో సినిమాలను విడుదల చేసుందుకు మేకర్స్ సంశయిస్తుంటారు. అయితే ఇప్పుడీ బాధ తెలుగు సినిమాలకు పట్టుకుంది. ముఖ్యంగా RRR మేకర్స్ ఈ విషయంలో సందేహాలను వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన RRR మూవీ మార్చి 25వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే మార్చి 26 నుంచి ఐపీఎల్ 2022 ఎడిషన్ ప్రారంభం కానుంది. ఈ రెండింటి మధ్య కేవలం 24 గంటల గ్యాప్ మాత్రమే ఉంది. ఈ క్రమంలో RRR మూవీ తొలి వారం కలెక్షన్లపై ఐపీఎల్ ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు.
అసలే కరోనా వల్ల ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడ్డ RRR మూవీకి ఇప్పుడు ఐపీఎల్ మరో అడ్డంకిగా మారిందని అంటున్నారు. ఈసారి ఐపీఎల్ లో మరో రెండు కొత్త టీమ్‌లు వచ్చి చేరాయి. దీంతో ఈసారి 8కి బదులుగా 10 టీమ్‌లు తలపడుతున్నాయి. అలాగే ఈ మధ్యే నిర్వహించిన మెగా వేలంలో పలువురు కీలకప్లేయర్లను భారీ ధరలకు ఫ్రాంచైజీలు పోటీ పడి మరీ కొనుగోలు చేశాయి. దీంతో ఈసారి ఐపీఎల్‌లో పోరు మరింత రసవత్తరంగా ఉంటుందని అంటున్నారు.
అలాగే ఈ సారి కరోనా కూడా పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చని తెలుస్తోంది. దీంతో మన దేశంలోనే జరగనున్న ఐపీఎల్‌కు స్టేడియంలలో ప్రేక్షకులను కూడా అనుమతిస్తారని తెలుస్తోంది. అదే జరిగితే ఐపీఎల్‌పై ఇంకా ఆసక్తి పెరుగుతుంది. ఇది RRR కలెక్షన్లపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. దీంతో ఈ చిత్ర మేకర్స్‌కు ఈ విషయంలో గుబులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. మరి నిజంగానే ఈ సినిమాపై ఐపీఎల్ ప్రభావం పడుతుందా.. లేదా.. అన్నది త్వరలో తెలియనుంది.