Amavasya : మనకు అమావాస్య, పౌర్ణమి అనే రెండు తిథులు ఉన్న సంగతి తెలిసిందే. పౌర్ణమిని శుభ సూచకంగా, అమావాస్యను అశుభ సూచకంగా భావిస్తూ ఉంటారు. అమావాస్య రోజు మాత్రం ఏ పని మొదలు పెట్టకూడదని మన పెద్దలు చెబుతుంటారు. కొందరైతే అమావాస్య దగ్గర్లో ఉంటే కూడా ఆ పనిని వాయిదా వేసి అమావాస్య వెళ్లిన తరువాత ఆ పనిని చేస్తుంటారు. అసలు అమావాస్యను అశుభ సూచకంగా ఎందుకు భావిస్తారు.. అమావాస్య రోజున ఏ పనిని మొదలు పెట్టకూడదా.. అలాగే కొంతమంది అమావాస్య రోజున వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలా వారు ఎందుకు ప్రవర్తిస్తారు.. వంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చాంద్రమానం ప్రకారం కృష్ణపక్షంలో వచ్చే 15వ తిథే అమావాస్య. దీనినే శూన్య తిథి అని అంటారు. ఈ రోజున చంద్రుడు కనిపించడు. నెలకొక అమావాస్య చొప్పున సంవత్సరానికి 12 అమావాస్యలు ఏర్పడతాయి. ఈ 12 అమావాస్యల్లో కొన్ని అత్యంత శక్తివంతంగా ఉంటాయి. అమావాస్య రోజున అతీంద్రియ శక్తులు తిరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే అమావాస్య రోజున క్షుద్ర పూజలు ఎక్కువగా చేస్తుంటారు. అలాగే అమావాస్య రోజు లక్ష్మీ దేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి.
అమావాస్య రోజున వేకువ జామునే తలస్నానం చేసి లక్ష్మీదేవికి దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి ఆఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది. అలాగే అమావాస్య నాడు పితృ దేవతలను స్మరిస్తే వారి అనుగ్రహం మనపై కలిగి సకల సంపదలను అనుగ్రహిస్తారట. అలాగే అమావాస్య రోజున ఇల్లువాకిలిని శుభ్రం చేసి కల్లాపి చల్లి ఉంచాలట. ముగ్గు మాత్రం వేయకూడదట. ముగ్గు వేస్తే అది వారిని ఆకర్షించి అక్కడే ఉండిపోతారట.
చంద్రుడిపై ఉండే అయస్కాంత శక్తి భూమిపై ఉండే సమస్త జీవరాశిని నియంత్రణలో ఉంచుతుంది. ఆ అయస్కాంత శక్తి మన మెదడుపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. ఈ ప్రభావం వల్లే అమావాస్య రోజున కొందరు విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. నలుపు అశుభానికి సూచిక కాబట్టి అమావాస్యను కీడుగా భావిస్తారు. అమావాస్య రోజున కొత్త బట్టలు కట్టుకోవడం, కొత్త పనిని మొదలు పెట్టడం, క్షవరం చేయించుకోవడం, గోర్లు తీయడం నిషిద్ధమని మన పెద్దలు చెబుతుంటారు.
ఇలా చేస్తే ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని విశ్వసిస్తారు. కానీ కొన్ని ప్రాంతాల్లో అమావాస్యను శుభ సూచకంగా భావించి ఆ రోజునే కొత్త పనులు మొదలు పెడుతుంటారు. పాండవులు మహా భారత యుద్ధాన్ని అమావాస్య రోజునే ప్రారంభించి విజయం సాధించారని చెబుతుంటారు.