Gas Trouble : ప్రస్తుత కాలంలో మనలో చాలా మందిని వేధిస్తున్న జీర్ణసంబంధిత సమస్యల్లో గ్యాస్ సమస్య కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో ఉన్న ఉరుకుల పరుగుల జీవితం కారణంగా చాలా మంది సమయానికి ఆహారాన్ని తీసుకోవడం లేదు. అలాగే చాలా మంది జంక్ ఫుడ్ ను, నూనెలు, మసాలా పదార్థాలు ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇలా మారిన ఆహారపు అలవాట్ల కారణంగా మనం తీసుకునే పదార్థాల్లో పీచు పదార్థాలతోపాటు ఇతర పోషకాలు కూడా తక్కువగా ఉంటున్నాయి. దీని ద్వారా మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవ్వకపోవడం, అజీర్తి, మలబద్దకం, గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణసంబంధిత సమస్యల బారిన పడుతున్నాం.
మలబద్దకం కారణంగా కూడా పొట్టలో గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మన వంటింట్లో ఉండే పదార్థాలను వాడి గ్యాస్ సమస్యతోపాటు ఇతర జీర్ణాశయ సంబంధిత సమస్యల నుండి కూడా బయటపడవచ్చు. పొట్టలో గ్యాస్ సమస్యను దూరం చేసే ఇంటి చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గ్యాస్, మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలతో బాధపడే వారికి ఈ చిట్కా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందుకోసం మనం ఒక టేబుల్ స్పూన్ ధనియాలను, ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను, 3 మిరియాల గింజలను, 3 లవంగాలు, ఒక గ్లాస్ నీటిని, చిటికెడు పసుపును ఉపయోగించాల్సి ఉంటుంది.
ముందుగా ఒక గిన్నెలో నీళ్లను పోసి ఆ నీటిలో పైన చెప్పిన పదార్థాలను వేయాలి. తరువాత ఈ గిన్నెను స్టవ్ మీద ఉంచి గ్లాస్ నీళ్లు అర గ్లాస్ అయ్యే వరకు మరిగించాలి. తరువాత ఈ నీటిని గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచి వడకట్టాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని రోజుకు ఒక పూట లేదా రెండు పూటలా తీసుకోవాలి. ఈ చిట్కాను పాటించడం వల్ల గ్యాస్ సమస్య చాలా త్వరగా నయం అవుతుంది. అంతేకాకుండా అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
ఈ చిట్కా తయారీలో ఉపయోగించే పదార్థాలన్నీ కూడా మనం వంటింట్లో ఉపయోగించేవే. ఇవి వంటలకు రుచిని ఇవ్వడంతోపాటు మన అనారోగ్య సమస్యలను దూరం చేసే ఔషధాలుగా కూడా ఉపయోగపడతాయి. ఇలా కషాయాన్ని తయారు చేసుకుని వాడడం వల్ల పొట్టలో గ్యాస్ సమస్య నిమిషాల వ్యవధిలోనే తగ్గు ముఖం పడుతుంది.
ఈ చిట్కాను పాటించడంతోపాటు తగినన్ని నీటిని తాగడం, అలాగే మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం, సమయానికి భోజనం చేయడం, జంక్ ఫుడ్ ను తక్కువగా తీసుకోవడం వంటివి చేస్తూ ఉండడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలయిన గ్యాస్, మలబద్దకం, అజీర్తి, ఎసిడిటీ, కడుపులో మంట వంటి తదితర సమస్యల బారిన పడకుండా ఉంటాం.