Gold : మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఎంతో పవిత్రంగా చూసుకుంటాం. వాటిని కింద కానీ అపరిశుబ్రమైన ప్రదేశంలో కానీ, మంచం మీద కానీ ఎక్కడ పెట్టం. పూజకు ఉపయోగించే పువ్వులు, కొబ్బరికాయలు, కర్పూరం, ఆగర్బత్తి వంటి పూజకు ఉపయోగించే వస్తువులను మనం ఎట్టి పరిస్థితుల్లో కింద పెట్టం. ఒకవేళ కిందపెడితే వాటిని పూజకు ఉపయోగించము. అలా కింద పెట్టిన వస్తువులను పూజకు ఉపయోగిస్తే అశుభం జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. ఇవే కాక మన హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కింద పెట్టని మరో ఐదు వస్తువులు ఉన్నాయి. వాటిని కనుక నేల మీద పెడితే అంతా అశుభమే జరుగుతుందని పండితులు చెబుతున్నారు. అస్సలు కింద పెట్టకూడని ఆ ఐదు వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఎట్టిపరిస్థితుల్లో కింద పెట్టకూడని వస్తువుల్లో మొదటిది దీపం. వెలుగుకు ప్రతిరూపంగా దీపాన్ని భావిస్తారు. దేవుడు ముందు పెట్టే దీపాలను ఎట్టి పరిస్థితులోనూ నేల పెట్టరాదు. వాటిని వెలిగించిన, వెలించకపోయిన వాటిని శుబ్రమైన వస్త్రం మీదే ఉంచాలి. అంతేకానీ నేల మీద పెట్టరాదు. నేల మీద దీపాలు పెడితే దేవున్ని అవమానించినట్టే అవుతుందట. మనకు అవసరమైన వాటిని పొందడానికి, ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించుకోవడానికి సులభమైన మార్గం దీపారాధన. దీపం వెలుగుపడిన చోట ఆధ్యాత్మిక శక్తి ఆ స్థలాన్నినింపుతుంది. ఇక కింద పెట్టని పవిత్రమైన వస్తువుల్లో రెండవది బంగారం. బంగారం అంటే సాక్షాత్తు లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తాం.
అలాంటి బంగారాన్ని నేల మీద పెడితే లక్ష్మీ దేవి ఆగ్రహానికి లోనై అనేక కష్టాలు పడతారు. అలా చేసిన వారికి ఇంట్లో ధనం ఒక్క క్షణం కూడా నిలవదట. కుటుంబానికి అన్నీ సమస్యలే వస్తాయట. కాబట్టి బంగారాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో కింద పెట్టకూడదు. కింద పెట్టకూడని వస్తువుల్లో మూడవది జంధ్యం. జంధ్యం గురించి తెలిసిన వారు ఎవరూ దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పెట్టరు. బ్రహ్మణులు జంద్యాన్ని తల్లిదండ్రులకు, గురువులకు ప్రతి రూపంగా భావిస్తారు. అందుకే దానిని కింద పెడితే తల్లిదండ్రులను, గురువులను అవమానించినట్టే అవుతుందట. ఇక నాలుగవది శంఖువు. శంఖువులో సాక్ష్యాత్తు లక్ష్మీ దేవి కొలువై ఉంటుందట.
కనుక శంఖువును కూడా నేలపై పెట్టకూడదు. శంఖువును నేలపై పెడితే లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురి అవుతాము. దాంతో మన ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయట. ఇక చివరగా హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కింద పెట్టకూడని వస్తువుల్లో చివరది సాలిగ్రామం. నేపాల్ లోని గండకి నది తీరంలో ఒకరకమైన నల్లరాయి దొరుకుతుంది. దాన్ని సాలిగ్రామం అంటారు. ఆ రాయి విష్ణువుకు ప్రతిరూపం అని పురాణాలు చెబుతున్నాయి. ఈ రాయి విష్ణువుకు ప్రతిరూపం కాబట్టి నేలపై అస్సలు పెట్టకూడదు. అలా చేస్తే నేలపై పెట్టిన వారికి అప్పటి నుండి అన్నీ సమస్యలే ఎదురవుతాయట. ఒకవేళ నేలపై పెట్టాల్సి వస్తే చెక్కతో చేసిన శుభ్రమైన ఉపరితలం మీద మాత్రమే పెట్టాలట.