Poha Pakoda : మనం అటుకులను కూడా ఆహారంగా తీసుకుంటూఉంటాం. అటుకులను తీసుకోవడం వల్ల మన శరీరానికి వివిధ రకాల పోషకాలు అందుతాయి. అటుకులతో ఎక్కువగా మనం పోహా, అటుకుల మిక్చర్ వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా అటుకులతో ఎంతో రుచిగా ఉండే పకోడీలను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పకోడీలను తయారు చేయడం చాలా సులభం. అటుకులతో రుచిగా పకోడీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పోహా పకోడా తయారీకి కావల్సిన పదార్థాలు..
అటుకులు – ఒక కప్పు, శనగపిండి – అర కప్పు, బియ్యం పిండి – పావు కప్పు, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కరివేపాకు – 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
పోహా పకోడా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో అటుకులను తీసుకుని ముందుగా వాటిని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. తరువాత అటుకులను చేత్తో పిండుతూ ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె, శనగపిండి, బియ్యం పిండి ప్ప మిగిలిన పదార్థాలన్నింటిని వేయాలి. తరువాత అటుకులను కూడా బాగా కలపాలి. తరువాత శనగపిండి, బియ్యం పిండి కూడా వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలపాలి. పకోడి మిశ్రమం గట్టిగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె పోసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక పకోడి మిశ్రమాన్ని తీసుకుని పకోడిలా వేసుకోవాలి. పకోడి మిశ్రమాన్ని మనం గట్టిగా కలుపుకున్నాం కనుక పకోడీలు ముద్దలుగా ఉంటాయి. ఇలా వేసిన పకోడీలను మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా కరకరలాడుతూ ఉండే పోహా పకోడీలు తయారవుతాయి. సాయంత్రం సమయాల్లో ఏవైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా అటుకులతో పకోడీలను వేసుకుని తినవచ్చు. ఈ కొలతలతో చేయడం వల్ల పకోడీలు నూనెను ఎక్కువగా పీల్చకుండా కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.