Deepam : సూర్యుడు సమస్త ప్రాణికోటికి శక్తినిచ్చే ప్రదాత. అంతులేని శక్తి సూర్యునిలో దాగి ఉంటుంది. ప్రపంచానికంతటికీ సూర్యుడు వెలుగునిస్తుంటాడు. అలాంటి సూర్యుడిలో ఉన్నది అగ్ని అంశ. మనకు గాలి, నీరు, నేల, ఆకాశం, అగ్ని అని పంచ భూతాలు ఉంటాయి. ఇవన్నీ భిన్నమైన ప్రదేశాల్లో ఉంటాయి. ఇక అగ్ని కూడా కొన్ని చోట్ల ఉంటుంది. ఆ అగ్ని సూర్యుడితోపాటు మన జీర్ణవ్యవస్థలోనూ ఉంటుంది.
ఆయుర్వేదం ప్రకారం మన శరీరం కూడా పంచభూతాల ఆధారంగానే నిర్మాణమై ఉంటుంది. జీర్ణవ్యవస్థలో అగ్ని ఉంటుంది. కనుకనే మనం తిన్న ఆహారం అగ్నికి దహనమై మనకు శక్తి లభిస్తుంది. కనుక అగ్నికి మన నిత్య జీవితంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. కాబట్టి అగ్నిని ఎట్టి పరిస్థితిలోనూ అవమాన పరచకూడదు.
కొందరు కొవ్వొత్తులు, దీపాలను వెలిగించి ఉపయోగించుకుంటారు. అంత వరకు బాగానే ఉంటుంది. కానీ వాటి అవసరం తీరాక వాటిని నోటితో గాలి ఊది ఆర్పేస్తారు. ఇలా అసలు చేయరాదు. చేస్తే అగ్ని దేవున్ని అవమానించినట్లే అవుతుంది. కనుక దీపాలను, కొవ్వొత్తులను ఆర్పేయాల్సి వస్తే.. నోటితో గాలి ఊదకుండా.. చేత్తో ఆర్పేయాలి. అలాగే వీటిని వెలిగించేందుకు అగ్గిపుల్లను ఉపయోగిస్తే దాన్ని కూడా నోటితో గాలి ఊది ఆర్పకూడదు. దాన్ని అటు ఇటు ఆడించి లేదా చేత్తో ఆర్పేయాలి. ఇలా చేయడం వల్ల అగ్ని సంతోషిస్తాడు. లేదంటే అన్నీ నష్టాలే వస్తాయి. కష్టాలను కోరి తెచ్చుకున్నట్లు అవుతుందని పండితులు చెబుతున్నారు.