Dondakaya Menthi Karam : దొండకాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. దొండకాయలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడరు కానీ వీటిని కూడా మనం ఆహారంలో భాగంగా తీసుకోవాలి. దొండకాయలతో మనం ఎంతో రుచిగా ఫ్రైను తయారు చేస్తూ ఉంటాం. ఈ దొండకాయ ఫ్రైలో మెంతికారం పొడి వేసి దీనిని మరింత రుచిగా కూడా తయారు చేయవచ్చు. ఈ విధంగా మెంతికారం వేసి చేసిన దొండకాయ ఫ్రైను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. మెంతికారం వేసి దొండకాయ ఫ్రైను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దొండకాయ మెంతికారం తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – 3 టేబుల్ స్పూన్స్, నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్, మినపప్పు – ఒక టేబుల్ స్పూన్, శనగపప్పు – 2 టీ స్పూన్స్, మెంతులు – ఒక టీ స్పూన్, ధనియాలు – రెండు టీ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 7, చింతపండు – చిన్న నిమ్మకాయంత, నిలువుగా తరిగిన దొండకాయలు – అరకిలో, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ.
దొండకాయ మెంతికారం తయారీ విధానం..
ముందుగా కళాయిలో పల్లీలు, నువ్వులు, మినపప్పు, శనగపప్పు, మెంతులు వేసి చిన్న మంటపై వేయించాలి. తరువాత ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే చింతపండు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక దొండకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలపాలి. వీటిని 4 నిమిషాల పాటు వేయించిన తరువాత మూత పెట్టి వేయించాలి. దొండకాయ ముక్కలను మధ్య మధ్యలో కలుపుతూ పూర్తిగా వేయించిన తరువాత మిక్సీ పట్టుకున్న కారం, కరివేపాకు వేసి కలపాలి.
దీనిని మరో నాలుగు నిమిషాల పాటు కలుపుతూ వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దొండకాయ మెంతికారం తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే దొండకాయ కారం కంటే ఈ విధంగా మెంతికారం వేసి చేసే దొండకాయ ఫ్రై మరింత రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంతో తింటారు.