Dondakaya Roti Pachadi : మనం దొండకాయలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దొండకాయలల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని కూడా ఇతర కూరగాయల వలె ఆహారంలో భాగంగా తీసుకోవాలి. దొండకాయలతో మనం రకరకాల కూరలు, పచ్చళ్లు, వేపుళ్లు తయారు చేస్తూ ఉంటాం. దొండకాయతో చేసే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఎంతో రుచిగా ఉండే దొండకాయ రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి…అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దొండకాయ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, మెంతులు – ఒక టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, దొండకాయ ముక్కలు – 300 గ్రా., పచ్చిమిర్చి – 15, చింతపండు – ఒక చిన్న రెమ్మ, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – పావు కప్పు, శనగపప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, మినపప్పు – అర టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి -2, ఇంగువ – రెండు చిటికెలు, కరివేపాకు – ఒక రెమ్మ.
దొండకాయ పచ్చడి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మెంతులు వేసి వేయించాలి. మెంతులు చక్కగా ఎర్రగా వేగిన తరువాత ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసి వేయించాలి. తరువాత జీలకర్ర, కరివేపాకు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ దినుసులన్నీ పూర్తిగా చల్లారిన తరువాత వాటిని జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత అదే కళాయిలో దొండకాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. దొండకాయ ముక్కలు చక్కగా వేగిన తరువాత చింతపండు వేసి మరో రెండు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత రోట్లో వేయించిన దొండకాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి.
తరువాత ఉప్పు, ముందుగా మిక్సీ పట్టుకున్న పొడి, కొత్తిమీర వేసి అంతా కలిసేలా కలుపుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దానిని ముందుగా తయారు చేసుకున్న పచ్చడిలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దొండకాయ రోటి పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే దొండకాయ పచ్చడి కంటే ఈ విధంగా చేసిన దొండకాయ పచ్చడి మరింత రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.