Dry Fruit Laddu : డ్రై ఫ్రూట్ ల‌డ్డూ.. ఎంతో ఆరోగ్య‌క‌రం.. రుచిక‌రం.. త‌యారీ ఇలా.. రోజుకు ఒక‌టి తినాలి..!

Dry Fruit Laddu : మ‌నం వివిధ ర‌కాల డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. డ్రై ఫ్రూట్స్ రుచిగా ఉండ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. డ్రై ఫ్రూట్స్ లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌న్నీ ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల నీర‌సం, నిస్స‌త్తువ వంటి స‌మ‌స్య‌లు త‌గ్గి శ‌రీరానికి త‌గినంత శ‌క్తి ల‌భిస్తుంది. కంటిచూపు మెరుగుప‌డుతుంది. గుండె చ‌క్క‌గా ప‌ని చేస్తుంది. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. చ‌ర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. మ‌నం ప్ర‌తిరోజూ అన్నీ ర‌కాల డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకోలేము. క‌నుక వీటితో ల‌డ్డూల‌ను చేసుకుని తిన‌డం వల్ల మ‌నం రుచితో పాటు అన్ని ర‌కాల డ్రై ఫ్రూట్స్ ను కూడా తిన‌వ‌చ్చు. డ్రై ఫ్రూట్స్ తో రుచిగా, సుల‌భంగా, చాలా త‌క్కువ స‌మ‌యంలో అయ్యేలా ల‌డ్డూల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

డ్రై ఫ్రూట్ ల‌డ్డూ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, గోంధ్ – ఒక టేబుల్ స్పూన్, జీడిప‌ప్పు ప‌లుకులు – పావు క‌ప్పు, బాదం ప‌లుకులు – పావు క‌ప్పు, పిస్తా ప‌లుకులు – పావు క‌ప్పు, క‌ర్బూజ గింజ‌లు – పావు క‌ప్పు, గ‌స‌గ‌సాలు – ఒక టేబుల్ స్పూన్, ఎండు కొబ్బ‌రి పొడి – పావు క‌ప్పు, పండు ఖ‌ర్జూరాలు – ఒక క‌ప్పు, యాల‌కుల పొడి – అర టీ స్పూన్, జాజికాయ పొడి – పావు టీ స్పూన్.

Dry Fruit Laddu recipe in telugu very tasty and healthy eat daily one
Dry Fruit Laddu

డ్రై ఫ్రూట్స్ ల‌డ్డూ త‌యారీ విధానం..

ముందుగా ఒక కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడ‌య్యాక గోంద్ ను వేసి వేయించాలి. త‌రువాత దీనిని రోట్లోకి తీసుకుని మెత్త‌గా దంచుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో మ‌రో టీస్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడ‌య్యాక జీడిప‌ప్పు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో బాదం ప‌ప్పు, పిస్తాప‌ప్పు, క‌ర్బూజ గింజ‌లు వేసి వేయించి ప్లేట్ లోకి తీస‌కోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో గ‌స‌గ‌సాల‌ను వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఎండు కొబ్బ‌రి పొడిని వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు జార్ లో ఖ‌ర్జూరాల‌ను వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి.

నెయ్యి వేడ‌య్యాక వేయించిన ప‌దార్థాల‌తో పాటు పొడిగా చేసుకున్న గోంధ్ ను కూడా వేసుకోవాలి. త‌రువాత యాల‌కుల పొడి, జాజికాయ పొడి వేసి అంతా క‌లిసేలా ఒక నిమిషం పాటు బాగా క‌లుపుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్ర‌మం గోరు వెచ్చ‌గా అయిన త‌రువాత చేతికి నెయ్యి రాసుకుంటూ ల‌డ్డూల‌ను చుట్టుకోవాలి. ఈ ల‌డ్డూలు ఆరిన త‌రువాత గాలి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే డ్రైఫ్రూట్ ల‌డ్డూ త‌యార‌వుతుంది. పిల్ల‌ల‌తో పాటు పెద్ద‌లు కూడా ఈ ల‌డ్డూను తిన‌వ‌చ్చు. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి లేదా రెండు చొప్పున తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. పిల్ల‌లు, పెద్ద‌లు, గ‌ర్భిణీలు, బాలింత‌లు ఈ ల‌డ్డూల‌ను తిన‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు.

D

Recent Posts