Dry Gulab Jamun : మనకు స్వీట్ షాపుల్లో లభించే పదార్థాల్లో డ్రై గులాబ్ జామున్ కూడా ఒకటి. కోవాతో చేసే ఈ గులాబ్ జామున్ లు నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మెత్తగా, తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఈ డ్రై గులాబ్ జామున్ లను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా తేలిక. కింద చెప్పిన విధంగా చేయడం వల్ల అచ్చం స్వీట్ షాపుల్లో లభించే విధంగా ఉండే ఈ డ్రై గులాబ్ జామున్ లను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. రుచిగా, మెత్తగా డ్రై గులాబ్ జామున్ లను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
డ్రై గులాబ్ జామున్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి కోవా – 300 గ్రాములు, మైదాపిండి – ఒక కప్పు, కార్న్ ఫ్లోర్ – 2 టీ స్పూన్స్, యాలకుల పొడి – ముప్పావు టీ స్పూన్, పంచదార – ఒకటిన్నర కప్పు, నీళ్లు – ఒకటిన్నర కప్పులు, రోజ్ వాటర్ – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, ఎండు కొబ్బరి పొడి – అర కప్పు.
డ్రై గులాబ్ జామున్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పచ్చి కోవాను తీసుకోవాలి. తరువాత అందులో మైదాపిండి, కార్న్ ఫ్లోర్, యాలకుల పొడి వేసి చేత్తో నొక్కుతూ బాగా కలపాలి. అవసరమైతే రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి పగుళ్లు లేకుండా బాగా కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా కోవా మిశ్రమాన్ని తీసుకుంటూ పగుళ్లు లేకుండా చిన్న నిమ్మకాయంత పరిమాణంలో ఉండలుగా చేసుకోవాలి. తరువాత కళాయిలో పంచదార, నీళ్లు పోసి బాగా మరిగించాలి. పంచదార మిశ్రమం బాగా మరిగిన తరువాత దానిపై వచ్చే తేటను తీసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అడుగు లోతుగా ఉండే కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె కొద్దిగా వేడయ్యాక ముందుగా తయారు చేసుకున్న గులాబ్ జామున్ లను వేయాలి. వీటిని ఒక నిమిషం తరువాత కదుపుతూ చిన్న మంటపై పైకి తేలే వరకు వేయించాలి. గులాబ్ జామున్ లు పైకి తేలిన తరువాత మంటను పెద్దగా చేసి కదుపుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తరువాత మంటను మధ్యస్థంగా చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.
తరువాత ఈ గులాబ్ జామున్ లను తీసి వెంటనే పాకంలో వేయాలి. వీటిని అరగంట పాటు పాకంలో అలాగే ఉంచాలి. తరువాత వీటిని బయటకు తీసి ఎండు కొబ్బరి పొడిలో వేసి చుట్టూ అంటేలా కోట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే డ్రై గులాబ్ జామున్ తయారవుతుంది. దీనిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల 4 నుండి 5 రోజుల పాటు తాజాగా ఉంటాయి. తీపి తినాలనిపించినప్పుడు, స్పెషల్ డేస్ లో, పండుగలకు ఇలా డ్రై గులాబ్ జామున్ ను తయారు చేసుకుని తినవచ్చు. ఈ గులాబ్ జామున్ లను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.