Egg Bhurji : ఎంతో రుచిక‌ర‌మైన ఎగ్ బుర్జి.. త‌యారీ ఇలా..!

Egg Bhurji : కండ పుష్టికి, దేహ దారుఢ్యం కోసం వ్యాయామాలు చేసే వారికి ఎంతో ఉప‌యోగ‌ప‌డే ఆహారాల్లో కోడిగుడ్లు ఒక‌ట‌ని నిపుణులు చెబుతున్నారు. అధికంగా ప్రోటీన్స్ ను క‌లిగిన ఆహారాల్లో ఇవి ఒక‌టి. త‌రుచూ కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ల‌భిస్తాయి. కోడిగుడ్ల‌తో చేసే వంట‌కాల్లో ఎగ్ బుర్జి ( అండా బుర్జి) ఒక‌టి. ఎగ్ బుర్జి చూడ‌డానికి ఎగ్ ఫ్రై లాగే ఉన్న‌ప్ప‌టికి దీని రుచి వేరుగా ఉంటుంది. చాలా సులువుగా, రుచిగా ఉండేలా ఎగ్ బుర్జిని ఎలా త‌యారు చేసుకోవాలి.. దాని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Egg Bhurji preparation method
Egg Bhurji

ఎగ్ బుర్జి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కోడిగుడ్లు – 5, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 3 ( పెద్ద‌వి), చిన్న‌గా త‌రిగిన ట‌మాట – 1 (పెద్ద‌ది), చిన్న‌గా త‌రిగిన ప‌చ్చి మిర‌ప‌కాయ‌లు – 4, చిన్న‌గా త‌రిగిన అల్లం ముక్క‌లు – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – త‌గినంత‌, మిరియాల పొడి – పావు టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, ధ‌నియాల పొడి – పావు టీ స్పూన్, నూనె – 3 టేబుల్ స్పూన్స్.

ఎగ్ బుర్జి త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో నూనె వేసి కాగిన త‌రువాత త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లను వేయాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత త‌రిగిన ప‌చ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి ముక్క‌ల‌ను వేసి క‌లుపుతూ వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్క‌లు ఎర్ర‌గా వేగిన త‌రువాత ట‌మాట ముక్క‌ల‌ను వేసి వేయించుకోవాలి. ప‌సుపు, ఉప్పును వేసి క‌లిపి ట‌మాటాలు పూర్తిగా వేగే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత కారం పొడిని వేసి క‌లిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి.

ఇలా వేయించిన త‌రువాత కోడిగుడ్ల‌ను ప‌గ‌ల‌కొట్టి వేసి అవి చిన్న చిన్న ముక్క‌లుగా అయ్యేలా బాగా క‌లుపుకోవాలి. త‌రువాత మిరియాల పొడి, ధ‌నియాల పొడి వేసి క‌లిపి 5 నిమిషాల పాటు వేయించాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌ను వేసి మ‌రో 3 నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ బుర్జి త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే కోడిగుడ్ల‌ ఫ్రై కి బ‌దులుగా వీటితో అప్పుడ‌ప్పుడు ఈ విధంగా చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచితోపాటు శ‌రీరానికి కూడా మేలు జ‌రుగుతుంది.

D

Recent Posts