Egg Dum Biryani : ఎగ్ ద‌మ్ బిర్యానీ.. ఇంట్లో సుల‌భంగా రుచిక‌రంగా త‌యారు చేసుకోవ‌చ్చు..!

Egg Dum Biryani : ప్రోటీన్స్ ను అధికంగా క‌లిగిన ఆహారాల‌లో కోడి గ‌డ్లు కూడా ఒక‌టి. వీటిని మనం త‌ర‌చూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ల‌భిస్తాయి. పిల్ల‌లకు వీటిని ఆహారంలో భాగంగా ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో ఎదుగుద‌ల ఎక్కువ‌గా ఉంటుంది. మ‌నం ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్ల‌తో చేసే వంట‌ల‌ల్లో ఎగ్ ద‌మ్ బిర్యానీ కూడా ఒక‌టి. ఎగ్ ద‌మ్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. బ‌యట హోట‌ల్స్ లో దొరికే విధంగా ఉండే ఎగ్ ద‌మ్ బిర్యానీని మ‌నం ఇంట్లోనే చాలా సులువుగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఎగ్ ద‌మ్ బిర్యానీని ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎగ్ ద‌మ్ బిర్యానీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన కోడిగుడ్లు – 6, నానబెట్టిన బాస్మ‌తి బియ్యం – పావు కిలో, నూనె – 4 టేబుల్ స్పూన్స్, స‌న్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1 (మ‌ధ్య‌స్థంగా ఉన్న‌ది), ప‌సుపు – అర‌ టీ స్పూన్, కారం – త‌గినంత‌, ధ‌నియాల పొడి – రెండు టీ స్పూన్స్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండున్న‌ర టీ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, స‌న్న‌గా పొడుగ్గా త‌రిగిన ప‌చ్చి మిర్చి – 4, జీడిప‌ప్పు – కొద్దిగా, చిన్నగా త‌రిగిన ఉల్లిపాయ – 1, స‌న్న‌గా త‌రిగిన ట‌మాట – 1, పెరుగు – అర క‌ప్పు, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, త‌రిగిన పుదీనా – కొద్దిగా, నెయ్యి – రెండు టీ స్పూన్లు, బిర్యానీ మ‌సాలా పౌడ‌ర్ – ఒక టీ స్పూన్.

Egg Dum Biryani very tasty know the recipe
Egg Dum Biryani

మ‌సాలా దినుసులు..

దాల్చిన చెక్క ముక్క‌లు – 2, ల‌వంగాలు – 3, జాప‌త్రి – 1, అనాస పువ్వులు – 2, మ‌రాఠీ మొగ్గ‌లు – 2, యాల‌కులు – 3.

అన్నం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బిర్యానీ ఆకులు – రెండు, సాజీరా – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క ముక్క‌లు – రెండు, ల‌వంగాలు – 4, ఉప్పు – త‌గినంత, నూనె – ఒక టీ స్పూన్, నీళ్లు – త‌గిన‌న్ని.

ఎగ్ ద‌మ్ బిర్యానీ త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె కాగిన త‌రువాత స‌న్న‌గా పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ‌ల‌ను వేసి రంగు మారే వ‌ర‌కు వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే క‌ళాయిలో ఉడికించిన కోడిగుడ్ల‌ను, పావు టీ స్పూన్ ప‌సుపును, ఒక టీ స్పూన్ ధ‌నియాల పొడిని, జీల‌క‌ర్ర పొడిని, అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను, అర టీ స్పూన్ కారాన్ని, అర టీ స్పూన్ ఉప్పును వేసి 5 నిమిషాల పాటు వేయించి మ‌సాలాతో స‌హా కోడిగుడ్ల‌ను ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో బాస్మ‌తి బియ్యానికి నాలుగు రెట్ల నీళ్ల‌ను పోసి అందులో అన్నం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాన్నింటినీ వేసి మ‌రిగించాలి. నీరు మ‌రిగిన త‌రువాత నాన‌బెట్టుకున్న బాస్మ‌తి బియ్యాన్ని వేసి క‌లిపి 80 శాతం ఉడికే వ‌ర‌కు ఉడికించాలి.

ఇలా అన్నాన్ని ఉడికిస్తూనే మ‌రో స్ట‌వ్ మీద అడుగు భాగం మందంగా ఉండే మ‌రో క‌ళాయిలో నూనె వేసి నూనె కాగిన త‌రువాత మిగిలిన మ‌సాలా దినుసుల‌న్నింటినీ వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ప‌చ్చి మిర్చిని, జీడిప‌ప్పును వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌ల‌ను వేసి వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి 2 నిమిషాల పాటు వేయించిన త‌రువాత ట‌మాట ముక్క‌లు, కారం, ప‌సుపు, ధ‌నియాల పొడి, రుచికి త‌గినంత ఉప్పు వేసి క‌లిపి మూత పెట్టి చిన్న మంటపై ట‌మాట ముక్క‌లను పూర్తిగా ఉడికించాలి. ఇప్పుడు 80 శాతం ఉడికిన బాస్మ‌తి బియ్యం కింద స్ట‌వ్ ఆఫ్ చేసి నీరు అంతా పోయేలా జ‌ల్లి గిన్నెలో వేసి వ‌డ‌క‌ట్టాలి.

త‌రువాత ఉడికిన ట‌మాట ముక్క‌ల‌లో పెరుగును వేసి క‌లిపి 2 నిమిషాల పాటు వేయించాలి. ఇలా వేయించిన త‌రువాత ఇందులో ముందుగా వేయించిన మూడు కోడిగుడ్లను, కొద్దిగా కొత్తిమీర‌ను, పుదీనాను, కొద్దిగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ‌ల‌ను, స‌గం ఉడికించిన అన్నాన్ని వేయాలి. ఇలా వేసిన అన్నంపై మ‌ర‌లా కొద్దిగా కొత్తిమీర‌ను, పుదీనాను, వేయించిన ఉల్లిపాయ‌ల‌ను వేసి మిగిలిన అన్నాన్ని వేయాలి. ఇలా వేసిన త‌రువాత దీనిపై మిగిలిన కోడిగుడ్ల‌ను, వేయించిన ఉల్లిపాయ‌ల‌ను, కొత్తిమీర‌ను, పుదీనాను, నెయ్యిని, బిర్యానీ మ‌సాలాను వేసి మూత పెట్టి చిన్న మంట‌పై 15 నిమిషాల పాటు ఉడికించాలి. అన్నం అడుగు అంట‌కుండా ఉండ‌డానికి స్ట‌వ్ మీద పెనాన్ని ఉంచి దాని మీద క‌ళాయిని ఉంచి ఉడికించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల బ‌య‌ట దొరికే విధంగా ఉండే ఎగ్ ద‌మ్ బిర్యానీ త‌యార‌వుతుంది. దీనిని ఉల్లిపాయ‌లు, నిమ్మ‌ర‌సం, రైతాతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

Share
D

Recent Posts