Aloo Paratha : ఆలుగడ్డలతో సహజంగానే మనం తరచూ అనేక రకాల వంటకాలను తయారు చేస్తుంటాం. వీటిని టమాటాలతో కలిపి వండితే భలే ఉంటుంది. ఈ కూరను అన్నం లేదా చపాతీ దేంట్లో తిన్నా బాగానే ఉంటుంది. అయితే ఆలుగడ్డలతో పరాటాలను కూడా తయారు చేయవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ పరాటా తయారీకి కావల్సి పదార్థాలు..
గోధుమ పిండి – 2 కప్పులు, ఉప్పు, తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్, బంగాళాదుంపలు – 3 లేదా 4, కచ్చా పచ్చాగా దంచిన పచ్చిమిర్చి, జీలకర్ర మిశ్రమం – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, చాట్ మసాలా – ఒక టీ స్పూన్, నిమ్మరసం – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఆలూ పరాటా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండిని తీసుకుని తగినంత ఉప్పును వేసి బాగా కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తరువాత నూనె వేసి మరలా 5 నిమిషాల పాటు బాగా కలిపి పిండిపై మూతను ఉంచి 10 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. ఇప్పుడు బంగాళాదుంపలను కుక్కర్ లో వేసి మెత్తగా ఉడికించుకోవాలి. తరువాత వాటిపై ఉండే పొట్టును తీసి గడ్డలు లేకుండా చేత్తో మెత్తగా చేసుకోవాలి లేదా క్యారెట్ ను తురుమే యంత్రంతో తురుముకోవాలి. ఈ విధంగా చేసిన తరువాత వాటిలో మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు పిండిని తగిన పరిమాణంలో తీసుకుని పొడి పిండి వేసుకుంటూ కొద్దిగా చపాతీలలా వత్తాలి. తరువాత చపాతీకి తగినట్టుగా ఆలూ మిశ్రమాన్ని తీసుకుని చపాతీ మధ్యలో ఉంచి దానిని చపాతీ అంచులతో మూసేసి ముద్దలా చేసుకోవాలి. ఈ ముద్దను పొడి వేసుకుంటూ మరీ పలుచగా కాకుండా చపాతీలా వత్తుకోవాలి. ఈ పరాటానీ పెనం మీద వేసి రెండు దిక్కులా ఎర్రగా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో మృదువుగా ఉండే ఆలూ పరాటాలు తయారవుతాయి. వీటిని టమాట చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. తరచూ చపాతీలను తయారు చేసుకోవడానికి బదులుగా ఇలా చాలా సులువుగా, ఎంతో రుచిగా ఆలూ పరాటాలను కూడా తయారు చేసుకుని తినవచ్చు.