Egg Potato 65 : ఎగ్ పొటాటో 65.. బంగాళాదుంప, కోడిగుడ్లు కలిపి చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. స్నాక్స్ గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. పిల్లలు దీనిని ఎంతో ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. బయట లభించే మంచూరియాకు బదులుగా ఇలా ఇంట్లోనే ఎగ్ పొటాటో 65ని తయారు చేసుకుని తినవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎక్కువగా సమయం కూడా పట్టదు. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. ఎంతో రుచిగా ఉండే ఈ ఎగ్ పొటాటో 65 ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ పొటాటో 65 తయారీకి కావల్సిన పదార్థాలు..
బంగాళాదుంప – పెద్దది ఒకటి, ఉడికించిన కోడిగుడ్లు – 4, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, బియ్యం పిండి – ఒక టేబుల్ స్పూన్, శనగపిండి – 3 టేబుల్ స్పూన్స్, ఫుడ్ కలర్ – చిటికెడు, కోడిగుడ్డు – 1, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
టాసింగ్ చేయడానికి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి తరుగు – ఒక టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 4, కరివేపాకు – 2 రెమ్మలు, టమాట కిచప్ – 2 టేబుల్ స్పూన్స్, కారం – అర టీ స్పూన్.
ఎగ్ పొటాటో 65 తయారీ విధానం..
ముందుగా బంగాళాదుంపను తురుముకుని తీసుకోవాలి. తరువాత ఈ తురుమును నీటిలో వేసి శుభ్రంగా కడిగి నీరు లేకుండా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కోడిగుడ్లలో ఉండే పచ్చసొనను తీసేసి తెల్ల సొనను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అదే గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత పదార్థాలన్నీ వేసి కలపాలి. అవసరమైతే కొద్దిగా నీటిని చల్లుకుని బాగా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఈ పిండిని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని నూనెలో వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత టాసింగ్ కు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.
తరువాత వెల్లుల్లి తరుగు వేసి రంగు మారే వరకు వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత టమాట కిచప్, కారం వేసి కలపాలి. తరువాత వేయించిన బాల్స్ వేసి కలపాలి. సాస్ అంతా బాల్స్ కు పట్టేలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ పొటాటో 65 తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తరుచూ ఒకేరకం స్నాక్స్ కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు.