Endu Royyala Kura : మనం ఎండు రొయ్యలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ఎండురొయ్యలతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఎండు రొయ్యలతో చేసే వంటకాలు రుచిగా ఉన్నప్పటికి వాసన వస్తుందని చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడరు. కానీ కింద చెప్పిన విధంగా చేయడం వల్ల ఈ కూర రుచిగా ఉండడంతో పాటు వాసన రాకుండా ఉంటుంది. ఈ ఎండురొయ్యల కూరను తయారు చేయడం కూడా చాలా సులభం. రుచితో పాటు వాసన రాకుండా ఉండేలా ఈ ఎండు రొయ్యల కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎండు రొయ్యల కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండు రొయ్యలు – 40 గ్రా., నానబెట్టిన చింతపండు – 20 గ్రా., చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 3, మెంతులు – పావు టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, నూనె – 3 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు- 10, పసుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, ధనియాల పొడి – ఒక టీ స్పూన్.
ఎండు రొయ్యల కూర తయారీ విధానం..
ముందుగా రొయ్యల తల, తోక తీసి శుభ్రం చేసుకోవాలి. తరువాత వీటిని కళాయిలో వేసి 3 నిమిషాల పాటు వేయించాలి. తరువాత వీటిని నీటిలో వేసి 3 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత వీటిని శుభ్రంగా కడిగి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో జీలకర్ర, మెంతులు వేసి వేయించి పొడిగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చిటికెడు మెంతులు, అర టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తరువాత ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి.
ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత పసుపు, కారం వేసి కలపాలి. తరువాత రొయ్యలు వేసి కలపాలి. వీటిని 2 నిమిషాల పాటు వేయించిన తరువాత చింతపండు రసం వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి మరో 4 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత మిక్సీ పట్టుకున్న జీలకర్ర, మెంతిపొడి వేసి కలపాలి. తరువాత మరలా మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత కొత్తిమీర, ధనియాల పొడి వేసి కలిపి మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎండు రొయ్యల కూర తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.