Filter Coffee : మనలో చాలా మంది కాఫీని ఎంతో ఇష్టంగా తాగుతూ ఉంటారు. కొందరు ఉదయం లేవగానే కాఫీని తాగుతూ ఉంటారు. కొందరికైతే కాఫీ తాగనిదే రోజు గడవదని చెప్పవచ్చు. తగిన మోతాదులో కాఫీని తాగడం వల్ల మనం వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చని నిపుణులు చెబుతూ ఉంటారు. అదే విధంగా కాఫీలో కూడా చాలా రకాలు ఉంటాయి. వాటిలో ఫిల్టర్ కాఫీ కూడా ఒకటి. ఈ కాఫీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని రుచి చూసే ఉంటారు. పక్కా సౌత్ ఇండియన్ స్టైల్ లో ఈ ఫిల్టర్ కాఫీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫిల్టర్ కాఫీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – అర కప్పు, కాఫీ పొడి – 2 లేదా 3 టీ స్పూన్స్, పాలు – ఒక కప్పు, పంచదార – 3 టీ స్పూన్స్.
ఫిల్టర్ కాఫీ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో నీటిని పోసి మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత కాఫీ ఫిల్టర్ ను తీసుకుని అందులో కాఫీ పొడిని వేసుకోవాలి. కాఫీ స్ట్రాంగ్ గా కావాలనుకున్న వారు 3 టీ స్పూన్ల కాఫీ పొడిని వేసుకోవాలి. తరువాత దానిపై ఫిల్టర్ ను ఉంచాలి. ఇప్పుడు మరిగించిన నీటి నుండి 60 శాతం నీటిని అందులో పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి పిల్టర్ ను 10 నుండి 15 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. కాఫీ ఫిల్టర్ అవుతుండగానే మరో పక్కన స్టవ్ మీద గిన్నెలో పాలు పోసి వేడి చేయాలి. పాలు ఒక పొంగు వచ్చిన తరువాత పంచదార వేసి కలపాలి. ఈ పాలను మరో రెండు నుండి మూడు నిమిషాల పాటు మరిగించి స్వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పులో లేదా గ్లాస్ లో కొద్దిగా కాఫీ డికాషన్ ను తీసుకోవాలి. తరువాత ఇందులో పాలను పోసుకోవాలి. ఈ కాఫీని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫిల్టర్ కాఫీ తయారవుతుంది. ఈ విధంగా తయారు చేసిన కాఫీని అందరూ ఎంతో ఇష్టంగా తాగుతారు.