Irani Chai : ఇరానీ చాయ్.. ఈ చాయ్ ను రుచి చూడని వారు ఈ చాయ్ అంటే ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. ఈ చాయ్ ను తాగడం వల్ల మనసుకు స్వాంతన కలుగుతుందనే చెప్పవచ్చు. ఈ ఇరానీ చాయ్ ను సాధారణ చాయ్ కంటే దీనిని కొద్దిగా భిన్నంగా తయారు చేస్తారు. ఈ ఇరానీ చాయ్ ను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇరానీ చాయ్ ని అందరికి నచ్చేలా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇరానీ చాయ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – 2 కప్పులు, టీ పౌడర్ – ఒక టేబుల్ స్పూన్, పంచదార – 2 టేబుల్ స్పూన్స్, యాలకులు – 4, చిక్కటి పాలు – అర లీటర్.
ఇరానీ చాయ్ తయారీ విధానం..
ముందుగా రాగి లేదా ఇత్తడి గిన్నెలో నీళ్లు, టీ పౌడర్, పంచదారను, దంచిన యాలకులను వేసుకోవాలి. తరువాత గోధుమ పిండిని లేదా మైదా పిండిని ముద్దలా కలిపి గిన్నె అంచుల చుట్టూ ఉంచాలి. తరువాత దానిపై మూతను ఉంచి ఆవిరి బయటకు పోకుండా చూసుకోవాలి. తరువాత ఈ గిన్నెను స్టవ్ మీద ఉంచి 20 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై 10 నిమిషాల పాటు చిన్న మంటపై మరిగించాలి. ఇలా డికాషన్ మరుగుతుండగానే మరో గిన్నెలో పాలు పోసి వేడి చేయాలి. ఈ పాలను కలుపుతూ సగం అయ్యే వరకు మరిగించాలి. పాలు సగం అయిన తరువాత మంటను చిన్నగా చేసి అలాగే ఉంచాలి.
ఇప్పుడు డికాషన్ కింద స్టవ్ ఆఫ్ చేసి పైన మూతను తీయాలి. తరువాత దీనిని వడకట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పులో సగరం వరకు డికాషన్ ను పోయాలి. తరువాత మిగిలిన సగం మరిగించిన పాలను పోసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఇరానీ చాయ్ తయారవుతుంది. ఈ చాయ్ ను తాగిన వారు ఇంకో కప్పు చాయ్ కావాలని అడగక మానరు. ఈ విధంగా అప్పుడప్పుడూ మన ఇంట్లోనే ఇరానీ చాయ్ ను తయారు చేసుకుని తాగవచ్చు.