Fruit Halwa : మనం బొంబాయి రవ్వను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. రవ్వతో రకరకాల చిరుతిళ్లను, తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. రవ్వతో చేసే తీపి వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తయారు చేయడం కూడా చాలా సలుభం. రవ్వతో చేసుకోదగిన తీపి వంటకాల్లో ఫ్రూట్ హల్వా కూడా ఒకటి. పండ్లతో చేసే ఈ హల్వా చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా తక్కువ సమయంలో సులభంగా తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఫ్రూట్ హల్వాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్రూట్ హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – ఒక కప్పు, పంచదార – 2 కప్పులు, దాన్మిమకాయ – 1, చిన్న ముక్కలుగా తరిగిన ఆపిల్ – 1, ద్రాక్ష పండ్లు – 10, ఎండు ద్రాక్ష – 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి – పావు టీ స్పూన్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, గ్రీన్ ఫుడ్ కలర్ – చిటికెడు.
ఫ్రూట్ హల్వా తయారీ విధానం..
ముందుగా కళాయిలో రవ్వ వేసి వేయించాలి. దీనిని 5 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో 3 కప్పుల నీళ్లు, పంచదార వేసి కలుపుతూ వేడి చేయాలి. పంచదార కరిగి నీరు మరుగుతున్నప్పుడు యాలకుల పొడి వేసి కలపాలి. తరువాత రవ్వ వేస్తూ కలపాలి. తరువాత ఫుడ్ కలర్ వేసి దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించాలి.
తరువాత వేయించిన డ్రై ఫ్రూట్స్ తో పాటు ఆపిల్ ముక్కలు, ద్రాక్ష పండ్లు, దానిమ్మ గింజలను కూడా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఫ్రూట్ హల్వా తయారవుతుంది. దీనిని చల్లగా, వేడిగా ఎలా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. తీపి తినాలనిపించినప్పుడు, ఇంటికి అతిధులు వచ్చినప్పుడు ఇలా ఫ్రూట్ హల్వాను తయారు చేసుకోవచ్చు. ఈ ఫ్రూట్ హల్వాను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.