Instant Ragi Bun Dosa : చిరు ధాన్యాలైనటువంటి రాగులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. రాగులను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. రాగి పిండితో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. రాగులతో చేసుకోదగిన వంటకాల్లో రాగి బన్ దోశ కూడా ఒకటి. ఈ బన్ దోశ చాలా రుచిగా ఉంటుంది. చల్లారిన తరువాత కూడా ఈ దోశ మెత్తగా, మృదువుగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఎంతో రుచిగా ఉండే రాగి బన్ దోశను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి బన్ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
రాగిపిండి – ఒక కప్పు, బొంబాయి రవ్వ – ఒక కప్పు, పెరుగు – అర కప్పు, నీళ్లు – ఒక కప్పు, ఉప్పు – తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, క్యారెట్ తురుము – అర కప్పు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం తరుగు – అర టీ స్పూన్, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, వంటసోడా – రెండు చిటికెలు.
రాగి బన్ దోశ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో రాగిపిండి, బొంబాయి రవ్వ, పెరుగు, నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 20 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం తరుగు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత క్యారెట్ తురుము వేసి వేయించాలి. క్యారెట్ తురుము వేగిన తరువాత కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పిండిని జర్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, వంటసోడాతో పాటు వేయించిన క్యారెట్ తురుము మిశ్రమాన్ని కూడా వేసుకుని బాగా కలపాలి. తరువాత కళాయిలో నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక ఒక గంటె రాగి పిండిని తీసుకుని ఊతప్పం కంటే మందంగా దోశలా వేసుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి చిన్న మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. తరువాత దోశను మరో వైపుకు తిప్పుకుని ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రాగి బన్ దోశ తయారవుతుంది. దీనిని ఏ చట్నీతో కలిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఉదయం అల్పాహారాలతో పాటు మధ్యాహ్నం లంచ్ బాక్స్ లోకి కూడా ఈ బన్ దోశలను తయారు చేసుకుని తినవచ్చు. రాగిపిండితో ఈ విధంగా బన్ దోశలను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.