Function Style Mutton Curry : ఫంక్ష‌న్ల‌లో చేసే స్టైల్‌లో మ‌ట‌న్ క‌ర్రీని ఇలా సుల‌భంగా ఇంట్లోనే చేసుకోవచ్చు..!

Function Style Mutton Curry : మ‌న‌కు తెలంగాణా ధావ‌త్ ల‌ల్లో స‌ర్వ్ చేసే వంట‌కాల్లో మ‌ట‌న్ క‌ర్రీ కూడా ఒక‌టి. ధావ‌త్ లో వ‌డ్డించే ఈ మ‌ట‌న్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ గ్రేవీతో రుచిగా, ఘాటుగా ఉండే ఈ మ‌ట‌న్ క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. బ‌గారా అన్నంతో ఈ మ‌ట‌న్ క‌ర్రీని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ధావ‌త్ స్టైల్ మ‌ట‌న్ క‌ర్రీని మ‌నం కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. త‌రుచూ చేసే మ‌ట‌న్ క‌ర్రీల కంటే ఈ విధంగా త‌యారు చేసిన క‌ర్రీ మరింత రుచిగా ఉంటుంది. బ్యాచిల‌ర్స్, మొద‌టిసారి చేసే వారు కూడా ఈ కర్రీని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. తెలంగాణా ధావ‌త్ స్టైల్ మ‌ట‌న్ క‌ర్రీని ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌ట‌న్ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 7 నుండి 8 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకు – 1, జాప‌త్రి – చిన్న‌ది ఒక‌టి, చిన్న అనాస పువ్వు – 1, తోక మిరియాలు – 7, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 10, పుదీనా – గుప్పెడు, స‌న్న‌గా పొడవుగా త‌రిగిన పెద్ద ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, లేత మ‌ట‌న్ – కిలో, ఉప్పు – త‌గినంత, కారం – 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, వేడి నీళ్లు – త‌గినన్ని, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Function Style Mutton Curry recipe in telugu
Function Style Mutton Curry

మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ధ‌నియాలు – 2 టేబుల్ స్పూన్స్, మిరియాలు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, యాల‌కులు – 10, ల‌వంగాలు – 10, న‌ల్ల యాల‌కులు – 2, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, సాజీరా – పావు టీ స్పూన్, ఎండు కొబ్బ‌రి తురుము – పావు క‌ప్పు, గ‌స‌గ‌సాలు – 2 టీ స్పూన్స్.

మ‌ట‌న్ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో గ‌స‌గ‌సాలు త‌ప్ప మిగిలిన మ‌సాలా ప‌దార్థాలు వేసి వేయించాలి. ఇవ‌న్నీ చ‌క్క‌గా వేగిన త‌రువాత గ‌స‌గ‌సాలు వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవ‌న్నీ చ‌ల్లారిన త‌రువాత జార్ లో వేసి మెత్త‌ని పొడిగా చేసుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే గిన్నెలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ప‌ప‌చ్చిమిర్చి, పుదీనా వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ప‌సుపు వేసి క‌ల‌పాలి. ఉల్లిపాయ ముక్క‌లు ఎర్ర‌గా వేగిన త‌రువాత మ‌ట‌న్, ఉప్పు వేసి క‌ల‌పాలి. దీనిని 4 నిమిషాల పాటు పెద్ద మంట‌పై వేయించిన త‌రువాత మంట‌ను మ‌ధ్య‌స్థంగా చేసి కారం వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి 10 నిమిషాల పాటు వేయించాలి.

త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ 20 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్, గ్రేవీకి త‌గిన‌న్ని మ‌రికొన్ని నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి ముక్కలు మెత్త‌గా అయ్యి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. చివ‌ర‌గా కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మ‌ట‌న్ క‌ర్రీ త‌యార‌వుతుంది. ముదురు మ‌ట‌న్ తీసుకునే వారు కుక్క‌ర్ లో వేసి 4 నుండి 5 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి. ఇలా త‌యారు చేసిన మ‌ట‌న్ క‌ర్రీ ఘాటుగా చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చ‌పాతీ, రోటీ, పులావ్ వంటి వాటితో తిన‌డానికి ఈ క‌ర్రీ చాలా చ‌క్క‌గా ఉంటుంది.

D

Recent Posts