Tribal Chicken : చికెన్ కర్రీని మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో తినడానికి ఈ కర్రీ చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఈ కర్రీని వివిధ రకాలుగా తయారు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా కింద చెప్పిన విధంగా తయారు చేసే ట్రైబల్ చికెన్ కూడా చాలా రుచిగా ఉంటుంది. గిరిజ ప్రాంతాల వారు ఎక్కువగా ఈ చికెన్ ను తయారు చేస్తూ ఉంటారు. మామిడిఆకులతో ఆవిరి మీద ఉడికించి ఎటువంటి మసాలాలు లేకుండా చేసే ఈ చికెన్ చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఈ చికెన్ ను తింటే మళ్లీ ఇదే కావాలంటారు. దీనిని తయారు చేయడం చాలా సులభం. తరుచూ చేసే చికెన్ కర్రీతో పాటు ఇలా వెరైటీగా కూడా తయారు చేసి తీసుకోవచ్చు. ట్రైబల్ స్టైల్ లో చికెన్ కర్రీని మరింత రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ట్రైబల్ చికెన్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – అరకిలో, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు -ఒక టీ స్పూన్, నూనె – 4 లేదా 5 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2, తరిగిన పచ్చిమిర్చి – 8, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, కారం – 2టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, నీళ్లు – ఒక కప్పు, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ట్రైబల్ చికెన్ తయారీ విధానం..
ముందుగా చికెన్ ను శుబ్రంగా కడగాలి. తరువాత ఇందులో ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత శుభ్రమైన మామిడిఆకులను తీసుకుని నీటితో కడగాలి. తరువాత వీటిని చీపురు పుల్లలు లేదా టూత్ పిక్స్ తో విస్తరాకుల కుట్టుకోవాలి. తరువాత ఒక చిల్లుల గిన్నెను తీసుకుని అందులో కుట్టిన మామిడిఆకులను ఉంచాలి. తరువాత ఇందులో చికెన్ వేసి పై నుండి మరిన్ని మామిడి ఆకులతో దానిని మూసి వేయాలి. ఇప్పుడు మరో గిన్నెలో 2 కప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి. తరువాత ఇందులో ముందుగా సిద్దం చేసుకున్న చిల్లుల గిన్నెను ఉంచి మూత పెట్టి ఆవిరి మీద చికెన్ ను మెత్తగా ఉడికించాలి. చికెన్ ఉడికిన తరువాత ఉడికిన చికెన్ ను గిన్నెలోకి తీసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు కర్రీ తయారీకి గిన్నెలో నూనె పోసి వేడి చేయాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి కలపాలి.
తరువాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయ ముక్కలను ఎర్రగా వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత కారం, మరికొద్దిగా పసుపు, ధనియాల పొడి వేసి వేయించాలి. తరువాత ఉడికించిన చికెన్ వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసికలిపి మూత పెట్టి చిన్న మంటపై 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీర, కరివేపాకు చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ట్రైబల్ చికెన్ తయారవుతుంది. దీనిని వేడి వేడిగా అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన చికెన్ ను తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.